ఎస్‌సీవో సదస్సులో మోదీ ఫొటో కట్ చేసిన పాక్ ప్రధాని కార్యాలయం

ఎస్‌సీవో సదస్సులో మోదీ ఫొటో కట్ చేసిన పాక్ ప్రధాని కార్యాలయం
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయం, మంగళవారం షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో ఒక హాస్యాస్పదమైన రీతిలో పంచుకుంది. అయితే, అసలు ఫోటోను ఇతర ప్రపంచ నాయకులను తొలగించి, కేవలం తనను మాత్రమే ఆ చిత్రానికి మధ్యలో ఉంచి క్రాప్ చేసింది. 
 
పాకిస్తాన్ ప్రధానమంత్రి పంచుకున్న ఫోటోలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తజికిస్తాన్ అధ్యక్షుడు ఎమోమాలి రెహమాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్, కిర్గిజ్ కల్నల్ ఉలర్‌బీక్ జర్లికోవిచ్ షర్షీవ్ మాత్రమే ఉన్నారు. కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్ నగరంలో జరిగిన 26వ  ఎస్‌సీవో సదస్సు సమావేశానికి ముందు తీసిన ఈ ఫోటోలో, సభ్య దేశాల నాయకులు కలిసి నిలబడి ఉన్నారు.
 
మోదీతోపాటు మరికొందరు నేతలు లేరు. వారు కనిపించిన భాగాన్ని క్రాప్ చేసింది. అది కూడా పాక్ ప్రధాని నేతల మధ్యలో ఉన్నట్లుగా కట్ చేసి, పోస్ట్ చేసింది. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసలు చిత్రాన్ని పంచుకుంటూ, వాస్తవానికి షరీఫ్ కుడివైపు నుండి నాలుగో స్థానంలో నిలబడి ఉన్నారని, మిగతా ఐదుగురు ప్రపంచ నాయకులను కత్తిరించారని చూపించారు. 
 
మోదీతోపాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియస్, మరి కొందరు నేతలు కనిపించకుండా పోయారు. ఫోటోను అలా కత్తిరించడం వల్ల పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ మధ్యలో ఉన్నట్టు, ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నట్టు కనిపించింది. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు, సహకారాన్ని పెంపొందించేందుకు 26వ  ఎస్‌సీవో నాయకత్వ శిఖరాగ్ర సమావేశం 10 సభ్య దేశాలు, 15 భాగస్వామ్య దేశాలు, రెండు పరిశీలక దేశాలను ఒకచోట చేర్చింది.ఇండియా, పాక్ మధ్య విబేధాలున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై నేతలు కలుసుకున్నప్పుడు పరస్పరం గౌరవించుకుంటారు. ఆయా దేశాలు, దేశాధినేతలు ఇలాంటి సందర్భాల్లో హుందాగా వ్యవహరిస్తుంటారు. కానీ, పాక్ మాత్రం ఒక అంతర్జాతీయ ఈవెంట్‌ను అల్ప బుద్ధితో తగ్గించేసింది. 

దీనిపై సోషల్‌మీడియాలో విమర్శలు రావడంతో షెహ్‌బాజ్ షరీఫ్ తన వ్యక్తిగత ఎక్స్‌ఖాతాలో పూర్తి గ్రూప్ ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో అధికారిక పిఎంఒ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోను కావాలనే క్రాప్ చేశారా ? అనే చర్చ మొదలైంది. ఇది ఇంతటితో ఆగలేదు. ఎస్‌సిఒ నేతలు రౌండ్‌టేబుల్ సమావేశం వీడియోను కూడా క్రాప్ చేసి అందులో ప్రధాని మోదీ కనిపించకుండా చేశారు. ఇలా చిత్రాలను ఎడిట్ చేయడం ద్వారా షెహబాజ్ షరీఫ్‌కు సదస్సులో మరింత ప్రముఖ స్థానం ఉన్నట్టు చూపించే ప్రయత్నం జరిగింది. 

అయితే, ప్రధాని మోదీ మాత్రం అందుకు భిన్నంగా సదస్సుకు హాజరైన అందరు దేశాధినేతలు ఉన్న ఫోటోను తన అధికారిక ఎక్స్‌ఖాతాలో షేర్ చేశారు. అందులో పాక్ ప్రధాని షరీఫ్ కూడా ఉన్నారు. దీంతో పాక్ తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.