కోర్టు ధిక్కరణ కేసుల్లో అధికారిక విధుల్లో బిజీగా ఉన్నామన్న కారణంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లలో లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిన వ్యక్తిగత బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని ధర్మాసనం గుర్తు చేసింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 626/2ఏలోని ప్రైవేట్ భూమిని స్వాధీనం చేసుకున్న వ్యవహారంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు కొనసాగుతున్నది. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉన్నది. అయితే, విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని రంగనాథ్ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తప్పుబట్టారు.
భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ పిటిషనర్ వేసిన దరఖాస్తు పెండింగ్‌లో ఉండగానే, ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారని, దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, కమిషనర్ మినహాయింపు ఎలా కోరుతారని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఎల్ నినో ప్రభావంతో విచ్చలవిడిగా బోర్లు వేస్తున్న నేపథ్యంలో వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన విధుల్లో బిజీగా ఉన్నందున రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకాలేకపోయారని కమిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.
దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్ శ్రీధర్‌రెడ్డి వాదిస్తూ తహసీల్దార్ అమర్లింగం రాసిన లేఖ ఆధారంగా హైడ్రా కమిషనర్ భూమిని స్వాధీనం చేసుకున్నారని, పిటిషనర్‌కు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కోర్టు సమన్లు జారీచేసినప్పటికీ రంగనాథ్ విచారణకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Stories
కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’ `భారత్ వ్యతిరేక సమ్మిట్’
మాతా అమృతానందమయి మానవతా సేవలు ప్రపంచానికే ఆదర్శం
తెలంగాణ వ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్