అల్ప‌పీడ‌నంతో తెలంగాణ‌లో రెండు రోజులు భారీ వర్షాలు

అల్ప‌పీడ‌నంతో తెలంగాణ‌లో రెండు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింది. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.  వాతావరణ కేంద్రం వెల్ల‌డించిన ప్రకారం సోమవారం ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమై ఉంటుందని, హైదరాబాద్​లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మొదలైంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 3,185 క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరుతోంది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, ప్రస్తుతం 1401.06 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 17.80 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 12.54 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 16.80 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి కూడా 6,244 క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతోంది.
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 148 మీటర్లకు గానూ ప్రస్తుతం 146.80 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 20.17 టీఎంలసీలు ఉండగా, 16.89 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ప్రాజెక్ట్ నుంచి 406 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నట్లు తెలిపారు. వర్షం సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్న‌ది. 
హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.  

ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. సమృద్ధిగా వర్షాలు లేక పంటలను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్న అన్నదాతలు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంటలు ఎదుగుదల దశలో ఉన్నాయని ఈ సమయంలో వానలు ఎంతో కీలకమని చెబుతున్నారు. ఈ వర్షాల వల్ల పలు రకాల తెగుళ్లు సైతం సోకకుండా ఉంటాయని అంటున్నారు.