నిర్ణయాత్మక దశకు మావోయిజంపై సైద్ధాంతిక పోరాటం 

నిర్ణయాత్మక దశకు మావోయిజంపై సైద్ధాంతిక పోరాటం 
మావోయిజానికి వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక పోరాటం నిర్ణయాత్మక దశకు చేరుకుందని   త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనా రెడ్డి పేర్కొన్నారు. అనేకమంది మావోయిస్టులు లొంగిపోయి ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావడం అనేది, మావోయిస్టు సిద్ధాంతం వైఫల్యంపై, హింసా మార్గం పట్ల ఆకర్షణ కోల్పోవడంకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
 
సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో  “ఆహుతి- దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు వ్యతిరేకంగా పోరాటం” పుస్తకావిష్కరణలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ  యువతను దుర్వినియోగం చేసి అరాచకాన్ని ప్రేరేపించాలని చూసే శక్తుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  భావజాల శక్తులు సంస్థల ద్వారా పనిచేయడానికి లేదా యువతరంలోని కొన్ని వర్గాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మరింత అప్రమత్తత అవసరమని ఆయన చెప్పారు.
అలాగే భారత్ ను బలహీనపరచాలన్న శత్రువులు, ఇలాంటి శక్తులకు మద్దతిచ్చే అవకాశం కూడా వుందని తెలిపారు. ఐఎస్ఐ, అల్ ఖైదా వంటి నెట్ వర్క్ వల్ల పొంచి వున్న ముప్పును కూడా ప్రస్తావిస్తూ దేశంలో అంతర్గత విభేదాలు సృష్టించి, అస్థిరపరిచే ప్రయత్నాల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  తెలుగు రాష్ట్రాలలో నక్సల్స్ హింస, తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించే శక్తుల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తతతో వుండాలని ఇంద్రసేనా రెడ్డి స్పష్టం చేశారు. 
నక్సల్ హింస, తీవ్రవాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడి, నిలిచిన సంఘ్ స్వయంసేవకులు, విద్యార్థుల త్యాగాలను ప్రస్తావిస్తూ  1960 ప్రాంతంలో తెలంగాణ ఏబీవీపీ విస్తరణ, సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  ఏబీవీపీ ఉద్యమంలో చురుగ్గా విద్యార్థులు పాల్గొన్నారని, నక్సలైట్ వర్గాల నుంచి నిరంతరం వ్యతిరేకతను, బెదిరింపులను ఎదుర్కున్నారని పేర్కొన్నారు.
ఏబీవీపీతో సంబంధం వుండటం, తీవ్రవాద భావజాలాన్ని వ్యతిరేకించడం అన్న రెండు కారణాలతో అనేక మంది విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు దాడులకు గురయ్యారని, హత్యకు కూడా గురయ్యారని ఆయన విచారం వ్యక్తం చేశారు.అయితే ఈ పోరాటం కేవలం క్యాంపస్ లో జరిగిన ఘర్షణల పరంపర మాత్రమే కాదని, హింస, బెదిరింపులకు వ్యతిరేకంగా అంకిత భావంతో పోరాటం చేసి, విద్యార్థులు నిలబడ్డారని, ఇదో సైద్ధాంతిక పోరాటం అని అభివర్ణించారు.
ఈ సందర్బంగా గవర్నర్ సొంత అనుభవాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఓ రోజు క్యాంపస్ లో తనపై దాడి జరిగిందని, తాను తీవ్రంగా గాయపడ్డానని తెలిపారు. సకాలంలో అందిన వైద్యం కారణంగా తన ప్రాణాలు నిలబడ్డాయని చెబుతూ ఒకవేళ సకాలంలో చికిత్స గనక అందకపోయి వుంటే, అమరుల జాబితాలో తన ఫోటో కూడా వుండేదేమోనని అప్పుడప్పుడు అనిపిస్తుందని పేర్కొన్నారు.
హింసాత్మక ఘటనల్లో తమ కుమారులను కోల్పోయిన కుటుంబాలకు, శాశ్వత వైకల్యానికి గురైన కార్యకర్తలకు ఇంద్రసేన రెడ్డి నివాళులర్పించారు. ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ వేలాది మంది విద్యార్థులు, కార్యకర్తలు తమ నిబద్ధతను కొనసాగించారని, వారి త్యాగాలే ఈ ఉద్యమం ముందుకు సాగేలా చేశాయని ఆయన తెలిపారు.
అతివాదం అతి తీవ్రంగా వున్న కాలంలో ఈ పోరాటం జరిగిందని, ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకొని, ఇప్పటి తరం ఆ త్యాగాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలని నొక్కి చెప్పారు. అతివాద శక్తులను తట్టుకొని, ఎదిరించి త్యాగాలు చేసిన వారే లేకపోతే, నేడు మనం చూస్తున్న హైదరాబాద్ సాధ్యమయ్యేదే కాదని తేల్చి చెప్పారు. సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి అధ్యక్షత వహించారు. 
 
ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రసంగిస్తూ ఆహుతి అన్న పుస్తకంలో నమోదు చేసిన పోరాటాలు కేవలం బీజేపీ- వామపక్షాలు లేదా సంఘ్- వామపక్షాల మధ్య రాజకీయ ఘర్షఫణగానో, హిందూ ముస్లిం సంఘర్షణగానో చూడొద్దని సూచించారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతతో పాటు సంప్రదాయాలు, సాంస్కృతిక ఉనికికి తీవ్రవాద కార్యకలాపాలు ముప్పుగా పరిణమించాయని, అందుకే దానిపై వ్యతిరేకత తలెత్తిందని చెప్పారు.
 
విద్యార్థులలో జాతీయ చైతన్యం పెంపొందించడం కూడా ఈ పోరాటం లక్ష్యమని అంబేకర్ పేకరోన్తు దేశ మహనీయులను, సంప్రదాయాలను, వారసత్వాన్ని గౌరవించేలా విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు, ‘భారత్ మాతా కీ జై’ అనేదే తమ సందేశమని  తెలిపారు. ఇది కేవలం విద్యార్థుల పోరాటం మాత్రమే కాదని, ఒక విస్తృత సామాజిక, జాతీయ సవాల్ అని సమాజం గ్రహించడం ప్రారంభించడంతో, ఈ సమస్య క్రమంగా విశ్వవిద్యాలయ ప్రాంగణాలను దాటి విస్తరించిందని ఆయన తెలిపారు. 
 
విద్యార్థులు, స్వయంసేవకులు, కార్యకర్తలు తీవ్రవాద హింసకు వ్యతిరేకంగా ఏ పరిస్థితుల్లో నిలబడ్డారో యువత అర్థం చేసుకునేలా, పుస్తకాలలో నమోదైన ఆ త్యాగాల గురించి ప్రస్తుత తరానికి తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా మూడు పుస్తకాలను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.
`సాఫ్రాన్ సాక్రిఫైస్ తెలుగు అనువాదంగా `ఆహుతి’ పుస్తకం దేశాన్ని విభజించాలని ప్రయత్నించే శక్తులకు (ముఖ్యంగా తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్‌లలో) వ్యతిరేకంగా నిలబడిన సంఘ్ స్వయంసేవకుల త్యాగాలకు సంబంధించినది. `హ్యుమానిటీ బియాండ్ ఫియర్’ పుస్తకం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం 1984, 1985లలో జరిగిన హింసాకాండ సమయంలో సిక్కులను రక్షించడంలో సంఘ్ స్వయంసేవకులు పోషించిన పాత్రను పొందుపరిచింది.