బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నిధి అగర్వాల్‌ను ప్రశ్నించిన ఇడి

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నిధి అగర్వాల్‌ను ప్రశ్నించిన ఇడి
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో సినీ నటి నిధి అగర్వాల్ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణకు హాజరైయ్యారు. హైదరాబాద్‌లోని ఇడి ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు ఆమెను సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆమె గతంలో ప్రమోట్ చేసినట్లు పేర్కొంటున్న బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన పలు అంశాలపై అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం. 
 
నిధి అగర్వాల్ను ఈడీ అధికారులు దాదాపు రెండు గంటలకు పైగా విచారించారు. విచారణలో భాగంగా ప్రమోషనల్ కార్యక్రమాలకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి కాలపరిమితి, ప్రచారం కోసం అందించిన కంటెంట్, సోషల్ మీడియా, ఇతర డిజిటల్ వేదికల ద్వారా నిర్వహించిన ప్రమోషన్ల వివరాలపై ఇడి అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.  
 
బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి నిధి అగర్వాల్‌కు అందిన పారితోషికంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.  ఒక్కో ప్రమోషన్‌కు ఎంత పారితోషికం తీసుకున్నారు? ఆ మొత్తాలను ఏ విధంగా చెల్లించారు? ఎవరి నుంచి చెల్లింపులు వచ్చాయి? తదితర అంశాలపై వివరాలు నమోదు చేసినట్లు సమాచారం. 
 
ముఖ్యంగా బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు లేదా వారితో సంబంధం ఉన్న వ్యక్తుల నుంచి నిధి అగర్వాల్ బ్యాంకు ఖాతాల్లోకి జరిగినట్లు గుర్తించిన లావాదేవీలపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.  ఆయా చెల్లింపులు ప్రమోషనల్ ఒప్పందాలకు సంబంధించినవేనా? వాటికి సంబంధించి ఒప్పందాలు, ఇన్వాయిస్‌లు, ఇతర ఆధారాలు ఉన్నాయా? అనే అంశాలపై కూడా ప్రశ్నించినట్లు సమాచారం. 

కాగా, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో ఇప్పటికే 21 మంది సెలబ్రిటీలపై ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటికే సినీ హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్ తదితరులను విచారించి వివరాలు సేకరించారు. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన సినీ హీరోలు, యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే పలు కేసులను నమోదు చేశారు.