ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ గత పాలకులతో కలిసి ‘జాయింట్ వెంచర్ లూట్’ చేస్తున్నారని ఆరోపిస్తూ వీటిపై సిబిఐ, ఈడీ విచారణ జరిపించాలని బీజేపీ శాసనసభా పక్ష నేత (బీజేఎల్పీ) ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ సంస్థలకు, బీఆర్ఎస్ పార్టీకి బినామీగా ఉన్న ఫీనిక్స్ కంపెనీకి మధ్య భారీ క్విడ్ ప్రో కో జరిగిందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
అధికారంలోకి రాకముందు ఫీనిక్స్‌పై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలని, ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు వెనకడుగు వేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున అవినీతి, భూదందాలు జరుగుతున్నాయని, స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన క్షమాపణే ఇందుకు నిదర్శనమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కోట్ల రూపాయల విలువైన కోటి ఎకరాల భూములను 22ఎ నిషేధిత జాబితాలో పెట్టి బేరసారాలు నడుపుతున్నారని పేర్కొంటూ మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా యాదగిరిగుట్టలోని తన 42 ఎకరాల భూమి కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లిందని, దీని వెనుక కుట్ర దాగి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ భూదందాలు, నిషేధిత భూముల జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలని, సీబీఐ విచారణకి ఆదేశించాలని డిమాండ్ చేశారు. మంత్రి అయిన తర్వాత నానక్‌రామ్‌గూడ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని టీజీఐఐసీ ఇండస్ట్రియల్ భూములను రాత్రికి రాత్రే రెసిడెన్షియల్ జోన్‌లుగా మార్చి ఫీనిక్స్ కంపెనీ నుంచి సుమారు రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులను బదలాయించుకున్నారని డాక్యుమెంట్ల ఆధారాలతో సహా వివరించారు.
ఒకవైపు మంత్రిగా ఉంటూ రూ.1,400 కోట్ల పాలమూరు-రంగారెడ్డి కాంట్రాక్ట్‌ను రూ.4,300 కోట్లకు రివైజ్ చేసుకోవడం కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? అని నిలదీశారు. ఈ మొత్తం భూదందాలు, ఆస్తుల బదలాయింపులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని పొంగులేటికి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు.
“గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అన్ని ఆధారాలతో వేచి ఉంటాను. దమ్ము ధైర్యం ఉంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చకు రావాలి” అని సవాల్ విసిరారు. ఈ అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలతో ఈడీ, సీబీఐ, లోకాయుక్తలకు ఫిర్యాదు చేయడమే కాకుండా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా బహిరంగ లేఖ రాస్తామని స్పష్టం చేశారు.

More Stories
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నిధి అగర్వాల్‌ను ప్రశ్నించిన ఇడి
తెలంగాణాలో సినిమా టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు
ఆయుష్ వైద్య విద్యార్థుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి