* 50 మంది సిబ్బంది తొలగింపు, 10 నాయకత్వ పోస్టులకు ప్రకటన
పరీక్షా విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే చర్యల్లో భాగంగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తన సిబ్బందిలో 50 మందికి పైగా సభ్యులను తొలగించి, కీలక నాయకత్వ స్థానాల్లో నిపుణులను నియమిస్తోందని విద్యాశాఖ తెలిపింది. ప్రశ్నపత్రాలలో తలెత్తిన అనేక లోపాల కారణంగా యూజీసీ-నెట్ పరీక్షలోని మూడు సబ్జెక్టులకు రీ-ఎగ్జామినేషన్ నిర్వహించాలని ఎన్‌టీఏ ఆదేశించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. అలాగే పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్-యూజీ 2026 పరీక్ష రద్దయిన కొన్ని నెలల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.
‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్ట్‌లో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్‌టీఏను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్, ఇతర ఉన్నతాధికారులతో సోమవారం ఒక సమావేశాన్ని నిర్వహించారు. సంస్థను పునర్వ్యవస్థీకరించడం, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు చర్యలు చేపట్టినట్టు విద్యాశాఖ తెలిపింది. ఈ సమావేశంలో, ఇటీవలి సమస్యల నేపథ్యంలో పరీక్షా విధానాన్ని సంస్కరించే దిశగా ఎన్‌టీఏ తీసుకున్న చర్యల గురించి మంత్రికి వివరించారు.
“ఇటీవలి సమస్యల నేపథ్యంలో, ముఖ్యంగా మొత్తం వ్యవస్థను సంస్కరించే విషయంలో ఎన్‌టీఏ తీసుకున్న చర్యల గురించి మంత్రికి వివరించారు. ఎన్‌టీఏ నుండి 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు కూడా ఆయనకు తెలియజేశారు,” అని మంత్రిత్వ శాఖ తెలిపింది. “చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, సిఐఎస్ఓ, జీఎం (పరీక్ష భద్రత), జీఎం (ఆర్&డి, సైకోమెట్రిక్స్) వంటి పది కొత్త వృత్తిపరమైన నాయకత్వ స్థానాలకు ప్రకటనలు జారీ చేశాయి. ఆయా పోస్టులలో నియామక ప్రక్రియ కొనసాగుతోంది,” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సైబర్ భద్రత, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక విభాగాల కోసం ప్రైవేట్ రంగం నుండి కూడా నిపుణులను తీసుకువస్తున్నట్లు తెలిపింది. నిర్దేశిత పరీక్షా విధానాలను (ప్రోటోకాల్స్) కచ్చితంగా పాటించాలని మంత్రి ఆదేశించారు. అలాగే, అత్యంత గోప్యమైన కార్యకలాపాల నిర్వహణ (సిఓఎన్ఓపీఎస్) విధానం, ప్రత్యేక గదులు, ఎయిర్-గ్యాప్డ్ సిస్టమ్స్ (ఇంటర్నెట్ సంబంధం లేని వ్యవస్థలు), పరికరాల భద్రతా విధానాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని ఆయన ఆదేశించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పరీక్షా ప్రక్రియలన్నింటిపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, తీసుకున్న సరిదిద్దే చర్యలపై నివేదిక సమర్పించాలని ఎన్‌టీఏని ఆదేశించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. యుజిసి-నెట్ (జూన్ 2024) పరీక్షా పత్రాల్లోని లోపాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు రీ-టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ ఆదివారం రాత్రి ప్రకటించిన తర్వాత ఈ సమావేశం జరిగింది.
ఇంగ్లీష్, కామర్స్ పరీక్షలు సెప్టెంబర్ 9న జరుగుతాయి. అలాగే సోషియాలజీ పరీక్ష సెప్టెంబర్ 10న నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం, ఎన్‌టీఏ సంస్థ జూన్ 22 నుండి 30 వరకు 87 సబ్జెక్టులలో యుజిసి-నెట్ జూన్ 2026 పరీక్షను నిర్వహించింది.
మరోవంక, ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు సంబంధించి యూజీసీ-నెట్ 2026 పరీక్షలను తిరిగి నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ ప్రకటించిన మరుసటి రేజే ఏజెన్సీ చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎస్‌యూఐతోపాటు ఇతర విద్యార్థి సంఘాలు సోమవారం ఢిల్లీలో ఎన్‌టీఏ కార్యాలయం వెలుపల నిరసన చేపట్టాయి. ఎన్‌టీఏను రద్దు చేయాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
యూజీసీ నెట్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఐఎస్‌ఏ, ఆరోపణలపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేసింది. ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ, మొత్తం ప్రక్రియ నిర్వహణలో పాలుపంచుకున్న వారి పాత్రలపై విచారణ జరుపాలని డిమాండ్ చేసింది.

More Stories
బిజెపి శ్రేణులు నిరంతరం ప్రజలతో మమేకం కావాలి
ఆర్థిక, వ్యక్తిగత కారణాలతోనే బిజెపికి రాజీనామా
సిపిజే నిరసనలో పొలిసు ప్రవర్తనపై `సుప్రీం’ ఉన్నతస్థాయి కమిటీ