ఐఎస్‌ఐ అనుకూల షాహజాద్ భట్టి నెట్‌వర్క్ గుట్టురట్టు

ఐఎస్‌ఐ అనుకూల షాహజాద్ భట్టి నెట్‌వర్క్ గుట్టురట్టు
* స్వతంత్ర దినోత్సవం ముందే తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి 200 మంది అరెస్ట్
 
దేశంలో భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్న ఉగ్ర నెట్‌వర్క్‌ను భద్రతా బలగాలు అంతం చేశాయి. ఈ ముఠాకు చెందిన దాదాపు 200 మంది సభ్యుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మోదీ ప్రభుత్వం ఉగ్ర నెట్‌వర్క్‌ను నాశనం చేసిందని షా వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సహా వివిధ భద్రతా బలగాల సాయంతో ఉగ్ర నెట్‌వర్క్‌ ముఠాను పట్టుకున్నారు

 షాహజాద్ భట్టి నెట్‌వర్క్ (ఎస్‌బీఎన్‌) అనే సంస్థ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్త ఐఎస్‌ఐకి అనుకూలంగా పని చేస్తుంది. ఈ సంస్థలో 200 మంది వరకు సభ్యులు ఉన్నారు. వీరంతో దేశంలో భారీ కుట్రకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే ఈ సభ్యులు పోలీసులు, రక్షణకు సంబంధించిన ప్రదేశాలు, మతపరమైన ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించారు.   పలు చోట్ల నిఘా కోసం సీసీటీవీ కెమెరాల్ని కూడా ఏర్పాటు చేశారు. సంబంధిత సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారు. అయితే, ఎస్‌బీఎన్ కుట్రను భారత నిఘా విభాగం, భద్రతా బలగాలు చేధించాయి.  14 రాష్ట్రాలలో  అధికారులు, సెంట్రల్ ఏజెన్సీస్ కలిపి దాడులు చేసి వివిధ రాష్ట్రాల్లో దాదాపు 200 మందిని అరెస్టు చేశారు. 

నిందితుల వద్ద నుంచి ఐఈడీలు, గ్రెనేడ్లు, పిస్టల్స్, లైవ్ క్యాట్రిడ్జెస్, సీసీటీవీ కెమెరాలు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిపై పాకిస్తాన్ మార్క్ ఉన్నట్లు గుర్తించారు.  రాష్ట్ర పోలీసు బలగాల సహకారంతో, నిజ-సమయ నిఘా సమాచారం ఆధారంగా ఆగస్టు 12న ఈ సమన్వయ ఆపరేషన్ నిర్వహించారు. అధికారుల ప్రకారం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరగబోయే ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు, దాడులను అడ్డుకోవడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. 

‘ఎక్స్’ పోస్ట్‌లో హోం మంత్రి ఇలా వెల్లడించారు: “స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు మోదీ ప్రభుత్వం, ఐఎస్‌ఐ మద్దతుగల ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టి నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసింది. 200 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా విధ్వంసక దాడులకు దాని ప్రణాళికలను భగ్నం చేసింది. భారత భద్రతా దళాలు 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో సమన్వయ ఆపరేషన్లు ప్రారంభించి ఈ నెట్‌వర్క్‌ను చిన్నాభిన్నం చేశాయి”.

“ఉగ్రవాదం పట్ల భారతదేశానికి ఉన్న సున్నా-సహనానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఐఎస్‌ఐ నిధులతో నడిచే ఈ సంస్థ నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, సజీవ తూటాలు, గూఢచర్యానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలతో సహా భారీ మొత్తంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్ అనేక ఉగ్రవాద కార్యకలాపాలలో పాలుపంచుకుంది,” అని ఆయన తెలిపారు.

అరెస్టు అయిన వారిపై ఉపా సహా వివిధ చట్టాల కింద కేసు నమోదు చేశారు. వీరిలో యూపీ నుంచి 62 మంది, ఢిల్లీ నుంచి 51 మంది, పంజాబ్‌ నుంచి 44 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది, మహారాష్ట్ర నుంచి 8 మంది, ఉత్తరాఖండ్ నుంచి 5గురు, కర్ణాటక, బిహార్, గుజరాత్‌ నుంచి ముగ్గురు చొప్పున, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్‌, కేరళ నుంచి ఇద్దరు అరెస్టయ్యారు. వీరందరిపై ఢిల్లీ, కర్ణాటకల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దాదాపు 80 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

ప్రభుత్వ ప్రకటన ప్రకారం, షాజాద్ భట్టి నెట్‌వర్క్ (ఎస్‌బీఎన్‌) అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఒక ఉగ్రవాద సిండికేట్. ఇది భారతదేశవ్యాప్తంగా గ్రెనేడ్, ఐఈడీ, పెట్రోల్ బాంబు దాడులు, లక్షిత హత్యలకు పాల్పడుతోంది. అంతేకాకుండా, పోలీసు, రక్షణ,మతపరమైన ప్రదేశాలను గస్తీ కాయడానికి, గూఢచర్యం కోసం సీసీటీవీ కెమెరాలను అమర్చడానికి  ఎస్‌బీఎన్‌  స్థానిక ఏజెంట్లకు డబ్బు చెల్లిస్తోంది.