బహుభార్యత్వాన్ని నిర్మూలించే దిశగా కీలక చర్యలు చేపడుతున్న అస్సాం సర్కారు అందుకోసం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం కీలక ప్రకటన చేశారు.
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా చట్టబద్ధంగా తన భార్య నుంచి విడాకులు తీసుకోకుండా ఆమెను వదిలేసి మరో మహిళతో వివాహ బంధం ఏర్పరుచుకుంటే సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తన ప్రకటనలో హెచ్చరించారు. ఆ ఉద్యోగి జీతం నుంచి 20 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని మొదటి భార్య బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తామని తెలిపారు. అయితే ఆ ఉద్యోగి మొదటి భార్య దీని గురించి ప్రభుత్వం వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీఎం చెప్పారు.
“ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా మొదటి భార్య బతికి ఉండగానే, ఆమెకు న్యాయబద్ధమైన విడాకులు ఇవ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటే సదరు ఉద్యోగి జీతం నుంచి 20 శాతం సొమ్మును నేరుగా కోత విధించి మొదటి భార్య బ్యాంకు ఖాతాలో జమ చేసేలా నూతన విధానాన్ని పరిశీలిస్తున్నారు. బాధితురాలైన మొదటి భార్య ప్రభుత్వం లేదా సంబంధిత శాఖాధికారులకు పూర్తి వివరాలతో వినతిపత్రం సమర్పిస్తే, తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలులోకి తెచ్చేలా కఠిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నాము” అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది విడాకుల ప్రక్రియ పూర్తికాకుండానే మరో మహిళతో కలిసి ఉంటున్న కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిమంత తెలిపారు. విడాకుల అంశం కోర్టు వద్ద పెండింగ్‌లో ఉన్నా కూడా జీతంలో కోత కొనసాగుతుందని స్పష్టంచేశారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎదురుచూడకుండా మొదటి భార్యకు ఆర్థిక సహకారం అందించాలనేదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఇక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల వేతనంలో 10 శాతం కోత విధించనున్నట్లు హిమంత తెలిపారు.
విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు లేదా చట్టపరమైన విచారణ ప్రక్రియ పూర్తయ్యే వరకు మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అటువంటి సమయాల్లో వారు భర్త దయ కోసం వేచి చూసే పరిస్థితి రాకూడదనే ఈ కఠిన నిబంధనను తెస్తున్నట్లు సీఎం వెల్లడించారు. బాధితురాలికి సమాజంలో ఆత్మగౌరవంతో కూడిన జీవితం, తక్షణ ఆర్థిక చేయూతను అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ తరహా రక్షణను ప్రైవేట్ రంగానికి కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు సీఎం సంకేతాలు ఇచ్చారు.

More Stories
ఆర్థిక, వ్యక్తిగత కారణాలతోనే బిజెపికి రాజీనామా
సిపిజే నిరసనలో పొలిసు ప్రవర్తనపై `సుప్రీం’ ఉన్నతస్థాయి కమిటీ
యూపీకి వినోద్ తావ్డే, పంజాబ్ కు సతీశ్ పూనియా, గుజరాత్ కు తరుణ్ చుగ్