నీట్ తర్వాత ‘యూజీసీ నెట్‌’లో అనేక తప్పులు!

నీట్ తర్వాత ‘యూజీసీ నెట్‌’లో అనేక తప్పులు!
పోటీ పరీక్షల నిర్వహణ విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. నీట్ వివాదం, పరీక్షల షెడ్యూల్ మార్పులు, విద్యార్థుల నిరసనలతో గడిచిన ఏడాది తర్వాత, ఇప్పుడు  యూజీసీ-నెట్‌  2026 పరీక్ష కూడా ప్రశ్నపత్రం నాణ్యత, పరీక్షా ప్రమాణాలపై ఫిర్యాదులకు తావిచ్చింది. 
పరీక్షలు జరిగిన్నప్పుడే సోషియాలజీ ప్రశ్నపత్రంలో స్పెల్లింగ్, అనువాద లోపాలు ఉన్నాయని అభ్యర్థులు ఆరోపించగా, ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలోని అనేక ప్రశ్నలు గత ఏడాది పరీక్ష నుండే పునరావృతమయ్యాయని మరికొందరు పేర్కొన్నారు. పీహెచ్‌డీ ప్రవేశాలకు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత కోసం నిర్వహించే ‘యూజీసీ-నెట్‌’ పరీక్షల్లో భారీగా తప్పులు బయటపడ్డాయి.
మూడు సబ్జెక్టుల పరీక్షలు ఇంగ్లిష్‌, కామర్స్‌, సోషియాలజీలలో సరిదిద్దలేని స్థాయిలో తప్పులు ఉన్నట్టు గుర్తించామని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఆదివారం ప్రకటించింది.  అంతేకాకుండా ఈ సబ్జెక్టుల్లో గత పరీక్షల్లో వచ్చిన చాలా ప్రశ్నలు ఆప్షన్లతో సహా యథాతథంగా వచ్చినట్టు తేలిందని వెల్లడించింది.  కేవలం ప్రశ్నలను తొలగించడం, ఆప్షన్ల మార్పులకు అనుగుణంగా మార్కులు కేటాయించడం వంటి వాటికి అవకాశం లేనిస్థాయిలో లోపాలు ఉండటంతో మూడు సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపింది. 
సెప్టెంబరు 9న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంగ్లిష్‌ పరీక్ష, అదే రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కామర్స్‌ పరీక్ష, 10వ తేదీన ఉదయం 9 నుంచి 12 గంటల వరకు సోషియాలజీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.  విద్యార్థులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరమేదీ ఉండదని తెలిపింది. 
ఎన్‌టీఏ జూన్‌లో మొత్తం 87 సబ్జెక్టులకు యూజీసీ-నెట్‌ పరీక్షలు నిర్వహించింది. పరీక్షల అనంతరం ప్రశ్నల్లో తప్పులు, పునరావృతాలు ఉన్నట్టుగా ఎన్‌టీఏకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీనితో ఎన్‌టీఏ ఒక ప్రత్యేక కమిటీని నియమించి పరిశీలన జరిపింది.  ఈ క్రమంలో ఇంగ్లిష్‌, కామర్స్‌, సోషియాలజీ ప్రశ్నపత్రాల్లో సరిదిద్దలేని స్థాయిలో లోపాలు ఉన్నట్టు కమిటీ గుర్తించింది. 

ప్రముఖ వ్యక్తుల పేర్లు, పుస్తకాల పేర్లలో తప్పులు, అక్షర దోషాలు, వాక్యాల్లో గందరగోళం సృష్టించేలా విరామ చిహ్నాలు, సంబంధిత అంశాలతో ఏమాత్రం సంబంధం లేని పదాల వినియోగం, 2024 నాటి పరీక్షల్లోని పదులకొద్దీ ప్రశ్నలు ఆప్షన్లతో సహా యథాతథంగా పునరావృతం కావడం వంటి లోపాలు ఉన్నట్లు తేల్చింది.  ఈ స్థాయిలో లోపాలున్న ప్రశ్నపత్రాలను పరిగణనలోకి తీసుకోవడం ఏమాత్రం సరికాదన్న ఉద్దేశంతోనే తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎన్‌టీఏ వెల్లడించింది. 

మిగతా 84 సబ్జెక్టుల పరీక్షలకు సంబంధించిన జవాబు ‘కీ’లను ఆదివారం విడుదల చేసింది. ఈ సబ్జెక్టుల ఫలితాలను షెడ్యూల్‌ ప్రకారమే ప్రకటిస్తామని వెల్లడించింది. 2024 జూన్‌లో ఎన్‌టీఏ నిర్వహించిన యూజీసీ-నెట్‌ పరీక్షను అది జరిగిన మరునాడే రద్దు చేయడం గమనార్హం. ప్రశ్నపత్రాలు లీకై ఉండవచ్చన్న జాతీయ సైబర్‌క్రైమ్‌ విభాగం హెచ్చరికలతో దానిని రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించారు.