త్వరలో జరగనున్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను పిలవొద్దంటూ 450 మంది విద్యార్థులు ఆ వర్సిటీ ఉపకులపతికి, రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. గత నెలలో జరిగిన నీట్ నిరసనల సమయంలో పోలీసులు అక్రమంగా వ్యవహరించారన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌కు సంబంధించి సిజెఐ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
వీరిలో పట్టభద్రులవుతున్నఎల్ ఎల్ బి, ఎల్ఎల్ఎం బ్యాచ్ విద్యార్థులు కూడా ఉన్నారు. సంప్రదాయం ప్రకారం, గత కొన్నేళ్లుగా నల్సార్ స్నాతకోత్సవ ప్రసంగాన్ని ప్రస్తుత సిజెఐలే చేస్తూ వస్తున్నారు. విద్యార్థుల వ్యతిరేకత దృష్ట్యా, ఈ ఏడాది స్నాతకోత్సవ కార్యక్రమాన్ని యూనివర్సిటీ రద్దు చేసే అవకాశం ఉందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధ్యాపకుడు తెలిపారు.
అధికారులకు మొదటి విజ్ఞప్తిని జూలై 23న పట్టభద్రులవుతున్న ఎల్ ఎల్ బి బ్యాచ్‌కు చెందిన 70 మంది విద్యార్థులు పంపారు. జూలై 25 నాటికి, 2027, 2028, 2029, 2030, 2031 బ్యాచ్‌లకు చెందిన సుమారు 380 మంది విద్యార్థులు ఆ ప్రకటనకు మద్దతు తెలుపుతూ యూనివర్సిటీ యంత్రాంగానికి తమ సొంత లేఖలను సమర్పించారు.
ఢిల్లీలో జూలై 20న నిరసనకారులైన విద్యార్థులపై పోలీసులు జరిపిన చర్యల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సుమోటోగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు జూలై 22న నిరాకరించింది. పోలీసుల అరాచకానికి సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయని ఒక న్యాయవాది పేర్కొన్నప్పుడు, కోర్టు సమయాన్ని “వృథా” చేయకూడదని చెబుతూ సిజెఐ కాంత్ ఆ వీడియోలను పరిశీలించడానికి మౌఖికంగా నిరాకరించారు.
2029లో పట్టభద్రులయ్యే బ్యాచ్ ఇలా రాసింది: “…పట్టభద్రులవుతున్న బ్యాచ్ వ్యక్తం చేసిన ఆందోళనలతో మేము ఏకీభవిస్తున్నాము. వారి విజ్ఞప్తి కేవలం ఒక బ్యాచ్‌కు సంబంధించిన తక్షణ ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాకుండా, నల్సార్ ఆచరించాలని భావించే రాజ్యాంగ విలువలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతుందని మేము భావిస్తున్నాము.”
2028 బ్యాచ్ విద్యార్థులు రాసిన లేఖ ప్రకారం, స్నాతకోత్సవానికి ప్రస్తుత సిజెఐ హాజరుకావడాన్ని వారు “తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు”. 2030 బ్యాచ్ విద్యార్థుల లేఖ మరింత సూటిగా ఉంది. అందులో ఇలా పేర్కొన్నారు: “రికార్డుల ప్రకారం, ‘దయచేసి మా సమయాన్ని వృథా చేయకండి. ఈ వీడియోలను చూసేంత సమయం మాకు లేదు’ అని సిజెఐ వ్యాఖ్యానించారు”.
“గతంలో కూడా, యువతను ‘వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు, బొద్దింకలు’ అని సిజెఐ అభివర్ణించారు. భారతదేశ అత్యున్నత న్యాయ పదవిలో ఉన్న వ్యక్తి నుండి ఇటువంటి ప్రవర్తన రావడం, మన రాజ్యాంగ ఆశయాలకు లేదా నల్సార్ తన చరిత్రలో పాటించిన విలువలకు అనుగుణంగా లేదని మేము భావిస్తున్నాము.”

More Stories
`ఏఐ’ వాతావరణ అంచనాలతో లబ్ది పొందిన తెలంగాణ రైతులు
టెలిఫోన్ చట్టం జోడించి ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు చార్జిషీట్
చెక్ బౌన్స్ కేసులో దోషిగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి