మెదక్ జిల్లా కొల్చారం మండలం యనగండ్ల గ్రామంలో రాష్ట్రకూటుల కాలానికి (క్రీ.శ. 9వ శతాబ్దం) చెందిన అరుదైన గజలక్ష్మి శిల్పం వెలుగులోకి వచ్చింది. సుమారు 1,100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శిల్పాన్ని సంరక్షించి భావితరాలకు అందించాలని చరిత్రకారులు ఈమని శివనాగిరెడ్డి, శ్రీరామోజు హరగోపాల్ గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
మెదక్ పట్టణంలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బుర్రా సంతోష్ అందించిన సమాచారం మేరకు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ ఆదివారం యనగండ్ల గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో రావిచెట్టు కింద నిర్లక్ష్యంగా పడి ఉన్న నల్లరాతి శిల్పాన్ని పరిశీలించారు.
శిలాతోరణంపై అలంకరణగా ఏర్పాటు చేసిన ఈ శిల్పంలో గజలక్ష్మి పద్మాసనంపై కూర్చుని, రెండు చేతుల్లో పద్మాలను ధరించి, తలపై కిరీటంతో పాటు ఒంటినిండా ఆభరణాలతో దర్శనమిస్తుందని చరిత్రకారులు వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా కనిపించని అరుదైన అమృత మథన దృశ్యం ఈ శిల్పానికి విశిష్టతను చేకూరుస్తోందని వారు అభిప్రాయపడ్డారు. త్రిమూర్తులలో శివుడి ఆధిక్యతను సూచించే విధంగా ఈ శిల్పరూపాన్ని మలిచినట్లు పేర్కొన్నారు.
గజలక్ష్మి, నటరాజ రూపాలతో పాటు అమృత మథన ఘట్టాన్ని ఒకే శిలపై చెక్కిన ఈ శిల్పం చారిత్రకంగా, శిల్పకళాపరంగా ఎంతో విలువైనదని చరిత్రకారులు తెలిపారు. ప్రస్తుతం నిర్లక్ష్యంగా పడి ఉన్న ఈ అరుదైన శిల్పాన్ని తగిన పీఠంపై ప్రతిష్ఠించి, భద్రపరిచి, భావితరాలకు అందించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గోపాల్ గౌడ్, కూరబోయిన సిద్ధరాములు, ప్రదీప్, నరేష్, లోకేష్, రంగప్ప గారి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Stories
ఢిల్లీలో కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్య హక్కులు, తెలంగాణలో బీజేపీకి నిర్బంధాలా?
మేధోపరమైన వైకల్యం కలిగిన పిల్లల పట్ల అవగాహన పెంపొందాలి
మహిళా మోర్చా ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడి