కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న అనుబంధం గట్టిగా ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై బిఆర్ఎస్ ప్రశ్నించదే అని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. కేటీఆర్‌కి అత్యంత ఆప్తుడిగా మెలిగి, ఆయన సిఫార్సుతో కాన్ఫర్డ్ ఐఏఎస్ సాధించిన నరసింహారెడ్డిని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ సీఎండీగా నియమించిందని తెలిపారు.
అలాగే గతంలో మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర తొమ్మిదేళ్ల పాటు పీఏగా పనిచేసి, ఆయన సిఫార్సుతో ఐఏఎస్ అయిన అశోక్ రెడ్డిని మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పెట్టారని విమర్శించారు. నేరుగా రిక్రూట్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండగా, వీరిద్దరినీ కీలక పదవులలో కూర్చోబెట్టి వేల కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని పేర్కొంటూ ఇది ఆ రెండు పార్టీల మధ్య బంధం కాదా? అని ప్రశ్నించారు.
ప్రజలు పెన్షన్లు, ఇళ్లు, సంక్షేమ పథకాల కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్‌లో రూ. 10,000 కోట్ల టెండర్లను రెండు ప్యాకేజీలుగా విభజించి తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు కట్టబెడుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ. 92,000 కోట్ల కాంట్రాక్ట్‌లు ఫ్లోట్ చేస్తే, అందులో రూ. 82,500 కోట్ల టెండర్లను ఆంధ్రా గుత్తేదారులకే అప్పగించారని మండిపడ్డారు.
ఆ ఆంధ్రా కాంట్రాక్టర్లు ఏ పనీ చేయకుండా, 30% నుండి 35% కమీషన్లకు తెలంగాణ చిన్న కాంట్రాక్టర్లకు సబ్-కాంట్రాక్ట్ ఇస్తూ ఇంట్లో కూర్చుని వేల కోట్లు సంపాదిస్తున్నారని చెబుతూ దీనికోసమేనా తెలంగాణ బిడ్డలు బలిదానం చేసుకున్నదని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పర్యవేక్షించే విద్యాశాఖలో ‘యంగ్ ఇండియా స్కూల్స్’ పేరుతో పెద్ద ఎత్తున ఓవర్ ఎస్టిమేషన్లతో దోపిడీ జరుగుతోందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
20 స్కూళ్లను ఒకే ప్యాకేజీగా చేసి, రూ. 500 కోట్ల కాంట్రాక్టులను ఆంధ్రా గుత్తేదారులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్లు 30% తక్కువకే పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నా, కావాలని బడా కాంట్రాక్టర్లకే టెండర్లు వచ్చేలా మానిప్యులేట్ చేస్తున్నారని, పేర్కొంటూ విచారణ జరిపే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా? అని సవాల్ విసిరారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రంలో విద్యుత్, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రభుత్వ ధనంతో అమెరికా టూర్లకు వెళ్తున్నారని విమర్శించారు. ఆయన వెంట సింగరేణి సీఎండీ, ట్రాన్స్పోర్ట్ సీఎండీలను తీసుకెళ్లడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. సింగరేణిలో 466 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు, ఏఎంఆర్ కంపెనీ కాంట్రాక్ట్ పొడిగింపు వెనుక రూ. 20,000 కోట్ల కుంభకోణం ఉందన్న సొంత కేబినెట్ మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలపై ఎందుకు విచారణ జరిపించారని విస్మయం వ్యక్తం చేశారు.
అలాగే సివిల్ సప్లైస్ శాఖలో స్టీఫెన్ రవీంద్ర కమిషనర్‌గా ఉన్న సమయంలో 9,000 మెట్రిక్ టన్నుల ధాన్యం (ప్యాడీ) మిస్సింగ్ అవ్వడంపై విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు వర్తించే 22ఏ నిబంధనలను ప్రైవేట్ భూములకు వర్తింపజేసి, క్లియరెన్స్ పేరుతో భూ యజమానులను వేధిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
40 శాతం కమీషన్ ఇస్తేనే 22ఏ నుంచి భూములను రివోక్ చేస్తూ, ఒక షెల్ కంపెనీ, కుటుంబ సంస్థల ద్వారా రూ. 15,000 కోట్ల విలువైన భూములను బదలాయించుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలన్నింటిపై కేటీఆర్ ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ అంశాలపై బిఆర్ఎస్ కూడా మౌనం వీడాలని, ఆరోపణలు అవాస్తవమైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

More Stories
ఇంగ్లాండ్ టీన్ ఆర్మీ కాలేజీలో అత్యాచారం, లైంగిక వేధింపులు
ప్రాంతీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థల నుండి రూ. 872.538 కోట్ల విరాళాలు
జూనియర్‌ను రేప్ కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ కు పదేళ్లు జైలు