ఆపరేషన్ త్రిశూల్ తో స్వదేశంకు 36 దేశాల నుంచి 274 మంది నేరస్థులు

ఆపరేషన్ త్రిశూల్ తో స్వదేశంకు 36 దేశాల నుంచి 274 మంది నేరస్థులు

దేశం విడిచి పారిపోయిన నేరస్థులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న ట్లు కేంద్ర హోం శాఖ  వెల్లడించింది. 2019 నుంచి 2026 వరకు మొత్తం 36 దేశాల నుంచి 274 మంది పరారీలో ఉన్న నేరస్థుల్ని భారత్‌కు తీసుకొచ్చినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వీరిలో ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, ఆర్థిక నేరస్థులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు, హత్యలు, అత్యాచారాలు పోక్సో చట్టం కింద నేరాలకు పాల్పడిన వారు కూడా ఉన్నారని తెలిపింది.

ఇదే సమయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద పరారీలో ఉన్న నేరస్థులకు చెందిన సుమారు రూ. 17,874 కోట్ల విలువైన ఆస్తుల్ని ప్రభుత్వ ఏజెన్సీలు అటాచ్ (జప్తు) చేసినట్లు హోంశాఖ స్పష్టం చేసింది. పరారైన ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన కేసుల్లో రూ. 18,762 కోట్లను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. హోం శాఖ గణాంకాల ప్రకారం అత్యధికంగా 2025లో పరారీలో ఉన్న 70 మంది నేరస్థుల్ని భారత్‌కు తీసుకొచ్చారు.

2026లో చూస్తే జులై వరకే ఏకంగా 45 మంది అప్పగింత పూర్తయింది. అంతకుముందు 2024 సంవత్సరంలో 43 మంది, 2023లో 37 మంది, 2022లో 40, 2021లో 23, 2020లో ఏడుగురు, 2019లో 9 మందిని భారత్‌కు తీసుకువచ్చినట్లు పేర్కొంది. భారత్‌కు రప్పించిన 274 మంది పరారైన నేరస్థులు వివిధ రకాల దారుణమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

వీరిలో 62 మంది హత్యలు, దోపిడీలు, హింసాత్మక నేరాల్లో నిందితులుగా ఉండగా, 53 మంది అత్యాచారాలు, పోక్సో కేసుల్లో; 42 మంది గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాల్లో; 18 మంది మానవ అక్రమ రవాణా, కిడ్నాప్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. మరో 17 మంది ఉగ్రవాదం, దేశద్రోహం, నార్కో టెర్రర్ కేసుల్లో; 16 మంది డ్రగ్స్,ఎన్డీపీఎస్ కేసుల్లో నేరస్థులుగా ఉన్నారు. స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, సైబర్ నేరాల్లో 12 మంది, ఆర్థిక మోసాల కేసుల్లో 9 మంది నిందితులుగా ఉన్నారు.

పరారీలోని నేరస్థుల్ని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ త్రిశూల్ చేపట్టింది. ఇక్కడ శాటిలైట్ లొకేషన్ వివరాలు, డిజిటల్ ఫుట్‌ప్రింట్లు, నిఘా వ్యవస్థల ఆధునిక సాంకేతికత సహాయంతో విదేశాల్లో పేర్లు, గుర్తింపులు మార్చుకొని దాక్కున్న నిందితుల్ని గుర్తించగలిగామని తెలిపింది. సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి), రా, ఎన్ఐఏ, ఈడీ, విదేశాంగ శాఖ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ఐబి), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్, రాష్ట్ర పోలీసు శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేసింది. దీనిని హోల్ ఆఫ్ గవర్న్‌మెంట్ విధానంగా అభివర్ణించింది.

ఇంకా ఇంటర్‌పోల్ సహకారంతో గత మూడేళ్ల కాలంలో 501 కంటే ఎక్కువగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా, 2026లోనే ఇప్పటివరకు 182 నోటీసులు జారీ అయ్యాయి. మరోవైపు దేశంలోని 1400 కంటే ఎక్కువ పోలీస్ ఏజెన్సీలను ఇంటర్‌పోల్‌తో అనుసంధానించేందుకు భారత్‌పోల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. దీని ద్వారా అంతర్జాతీయంగా సమాచార మార్పిడి సమయం గణనీయంగా తగ్గింది.

అమెరికా నుంచి 26/11 ముంబయి దాడి నిందితుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా‌ను భారత్‌కు తీసుకురావడం దేశం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటని హోం శాఖ పేర్కొంది. క్లిష్టమైన ఉగ్రవాద కేసుల్లో భారత్ అనుసరించిన న్యాయపరమైన, దౌత్యపరమైన ప్రయత్నాలకు ఇది ఉదాహరణగా నిలిచిందని తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో విదేశాల నుంచి నడిచే నార్కో- టెర్రరిజం నెట్‌వర్క్‌లను ఛేదించడంలోనూ ఈ చర్యలు కీలకంగా మారాయని తెలిపింది.