సోమవారం తంజావూరులోని పనగల్ బిల్డింగ్ వద్ద కావేరి జలాల హక్కులు, మేకెదాటు ప్రాజెక్టు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై జరిగిన డీఎంకే నిరసన సభలో ఉదయనిధి ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష, త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో తన ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి స్టాలిన్ అసభ్యకర రీతిలో ద్వంద్వార్థం వచ్చే విధంగా నటి త్రిషపై వ్యాఖ్యలు చేశారు.
నటి త్రిష పేరును ప్రస్తావించగా, ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీనిపై టీవీకే మహిళా వింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. మరోవైపు ఉదయనిధి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీవీకే జాతీయ అధికార ప్రతినిధి పళ సెల్వకుమార్ జాతీయ మహిళా కమిషన్‌కు ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు.
అయితే, తనపై వస్తున్న ఆరోపణలను తమిళనాడు ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తాను అనని మాటలను అన్నట్లు చూపించడానికి ‘కట్, కాపీ, పేస్ట్’ ఎడిటింగ్ పద్ధతులను ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు.
ఇటువంటి బెదిరింపులకు తాను భయపడనని, ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. అలాగే, తన అరెస్టుపై పోలీసుల చర్యను ఒక “కామెడీ”గా అభివర్ణించారు. కాగా, ఉదయనిధి వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. చెన్నైలోనూ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఉదయనిధి క్షమాపణ చెప్పాలని బీజేపీ, టీవీకే నాయకులు డిమాండ్ చేయగా, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని, అవి ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించినవి కావని డీఎంకే వాదిస్తోంది. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఉదయనిధికి ఈ గతి పట్టిందని బీజేపీ విమర్శించింది. ఒక మహిళను ఉద్దేశించి అభ్యంతకరంగా మాట్లాడిన మాటలకుగానూ ఆయన అరెస్టయ్యారని బీజేపీ నేత అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు.
మహిళలకు వ్యతిరేకంగా ఇలాంటి మాటలను డీఎంకే అంగీకరించకూడదని బీజేపీ నాయకురాలు తమిళసై సౌందర్ రాజన్ పేర్కొన్నారు. మరోవైపు, టీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. డీఎంకే నాయకత్వం రాజకీయ చర్చల ప్రమాణాలను దిగజార్చుతోందని ఆరోపించారు.

More Stories
‘జెన్ జెడ్’, ‘జెన్ ఆల్ఫా’ విద్యార్థులతో 6న డా. భగవత్ భేటీ
కర్ణాటక కాంగ్రెస్లో క్యాబినెట్ విస్తరణ కలకలం
వామపక్ష తీవ్రవాదంపై భారతదేశ పోరాటాన్ని మార్చివేసిన వ్యూహం!