కావేరీ నదీ జలాల వివాదంలో కర్ణాటకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు రెండు వారాల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ కమిటీ చేసిన సిఫార్సును కావేరీ జల నిర్వహణ అథారిటీ సమర్థించింది. ఈ ఉత్తర్వులు జులై 29 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
15 రోజుల పాటు రోజుకు 7 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన డిమాండ్‌ను తోసిపుచ్చిన కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ రెగ్యులేషన్ కమిటీ సిఫార్సు చేసిన రోజుకు 3,500 క్యూసెక్కుల విడుదలకు ఆమోదం తెలిపింది. తమ సొంత అవసరాల కారణంగా నీటిని విడుదల చేసే స్థితిలో లేమని కర్ణాటక చేసిన వాదనను కూడా తోసిపుచ్చింది.
ఈ 15 రోజుల వ్యవధిలో కర్ణాటక నుంచి మొత్తం 9 టీఎంసీల (వెయ్యి మిలియన్ క్యూబిక్ ఫీట్ల) నీటిని విడుదల చేయాలని తమిళనాడు ఒత్తిడి చేసింది. కావేరీ వాటర్ అథారిటీ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో, కర్ణాటకకు ఉన్న తదుపరి చట్టపరమైన మార్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడమేనని నిపుణులు తెలిపారు. ఈ ఉత్తర్వుపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ కావేరీ అంశంపై ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి కూడా వస్తున్నారని, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా ఒక పరిష్కారాన్ని కనుగొనడంపై తామంతా మనస్ఫూర్తిగా చర్చించాలనుకుంటున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, గురువారం ఉదయం మాండ్యలో సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ కార్యకర్తలు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు.
ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా పోస్టర్లను చించివేసి, నగరంలోని గురుశ్రీ సినిమా థియేటర్‌లో ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శనను రద్దు చేయడానికి అంగీకరించింది. మాండ్య జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించారు.
తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయవద్దని, మాండ్యలో రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నామని వారు ఆ వినతిపత్రంలో కోరారు. నిరసనకారుల్లో ఒకరు మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దయచేసి వారికి చెప్పండి, మాకు తాగునీరు కూడా లేదు, మా పశువులకు కూడా నీరు లేదు. ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. దయచేసి మాకు మరికొంత సమయం ఇవ్వండి’’ అని పేర్కొన్నారు.

More Stories
నీట్ లీకేజీ ఆందోళనకారులపై చర్యలు వద్దని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం
`వందేమాతరం’ బిల్లుకు లోక్‌సభ కూడా ఆమోదం
పెల్లెట్ గన్స్ వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు