రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బ్యారేజ్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు సురక్షితమని సర్వోన్నత ధర్మాసనం స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. కేంద్ర పర్యావరణ శాఖ 2021 నాటి ఆఫీస్ మెమోరాండం (ఓఎం)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అయితే ఈ తీర్పును భవిష్యత్ వర్తింపు విధానంలో అమలు చేయాలని ఆదేశించింది. దీనివల్ల గతంలో 2021 ఓఎం ద్వారా పొందిన అనుమతులన్నీ పూర్తిస్థాయిలో చెల్లుబాటులో ఉంటాయని, ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులకు ఎలాంటి డోకా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాలను భర్తీ చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వాలంటే కేంద్రం తప్పనిసరిగా చట్టబద్ధమైన నోటిఫికేషన్ తీసుకురావాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇకపై ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుంటే కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఇప్పటికే పూర్తయిన లేదా ప్రస్తుతం జరుగుతున్న కీలక ప్రాజెక్టుల పనులకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయని, తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలకు పూర్తి చట్టబద్ధమైన రక్షణ లభించిందని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు
వివాదాస్పద పర్యావరణ అనుమతుల అమలుకు అడ్డంకులు తొలగిపోవడంతో రాష్ట్రంలో వేలాది ఎకరాలకు సాగునీరు కోట్లాది మందికి తాగునీరు అందించే కీలక ప్రాజెక్టుల నిర్మాణ పనులకు దారి సుగమమయ్యిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పనులు నిలిచిపోయిన రిజర్వాయర్లు, కెనాళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం కానుందని అధికారులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుతో ముఖ్యంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట ప్రాంతాల రైతాంగం సైతం హర్షం వ్యక్తం చేస్తోంది.
పర్యావరణ అనుమతుల వివాదం శాశ్వతంగా ముగి యడంతో, నిధుల సమీకరణను వేగవంతం చేసి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ తీర్పుతో తెలంగాణ సాగునీటి రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ద్వారా 36.37 టిఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు 282.80 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని అధికారులు తెలిపారు.

More Stories
ఫీజు బకాయిలు రూ 15,000కోట్లు చెల్లింపుపై మాట తప్పారు
హైడ్రాపై హైకోర్టు ఆదేశంపై సీఎం రేవంత్ రెడ్డి ధిక్కార ధోరణి
పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి