హైడ్రాపై హైకోర్టు ఆదేశంపై సీఎం రేవంత్ రెడ్డి ధిక్కార ధోరణి

హైడ్రాపై హైకోర్టు ఆదేశంపై సీఎం రేవంత్ రెడ్డి ధిక్కార ధోరణి
కోర్టు ధిక్కారణ కేసుల వ్యవహారంలో హైడ్రా కమిషన్‌ రంగనాథ్‌ను తొలగించాలని, హైకోర్టు ఆదేశాలపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరులో ధిక్కార ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. = ‘ఏ అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభు త్వ విచక్షణ అధికారం, ఆ అధికారాన్ని ఎవరూ గుంజుకోలేరు’ అంటూ తేల్చి చెప్పారు. తద్వారా రంగనాథ్‌ను తొలగించబోమని పరోక్షంగా సంకేతాలిచ్చారని పలువురు భావిస్తున్నారు. 
 
అయితే, హైకోర్టు ఆదేశాలను తాను ఇంకా పరిశీలించలేదని, దీనిపై ప్రభుత్వపరంగా సమీక్షిస్తామని తెలిపారు. కోర్టు ఆదేశాలను, న్యాయస్థానాన్ని గౌరవిస్తామని చెబుతూనే ప్రస్తుతం హైడ్రా కొనసాగిస్తున్న పనులను కొనసాగిస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. అంతేగాక హైడ్రా ఏర్పాటు చేయడం  హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని పేర్కొంటూతమ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత గొప్ప సంస్కరణ అని చెప్పుకొచ్చారు. 
 
హైడ్రా అత్యుత్తమ సంస్థ అని, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందని పేర్కొంటూ కబ్జారాయుళ్లు, బీఆర్ఎస్​ నేతలు మాత్రమే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటే పేదలైనా, పెద్దలైనా చూస్తు ఊరుకోబోమని తేల్చిచెప్పారు. హైడ్రాను రద్దు చేయాలని కబ్జాకోరులు, దొంగలు మాత్రమే కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే పేదలైనా, పెద్దలైనా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బతుకమ్మకుంట, గండిపేట చెరువు ఆక్రమించుకున్నది పేదలా? పెద్దలా అని ప్రశ్నించారు. 
 
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని కోర్టులో ధిక్కారణ పిటిషన్లు వేస్తున్నారని మండిపడ్డారు.  చెరువులు, కుంటలు, నాలాలు కాపాడడమే హైడ్రా విధి అని స్పష్టం చేశారు. మరోవంక, హైడ్రా అకృత్యాలపై హైకోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది.  చట్టపరమైన ప్రక్రియను విస్మరించి ప్రైవేట్‌ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేరొంటూ హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. యజమానులకు నోటీసులు ఇవ్వకుండా, వారి వాదనలు వినకుండా ఏకపక్షంగా బోర్డు ఏర్పాటుచేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. 
 
హయత్‌నగర్‌ మండలం సాహెబ్‌నగర్‌ కలాన్‌లోని ప్లాట్‌ నం.10లో హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును సవాల్‌చేస్తూ ఝాన్సీ, మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. ఇంకోవైపు కొండాపూర్‌లోని సర్వే నంబర్‌ 60లో ప్రైవేట్‌ స్థలంలోని కాంపౌండ్‌ గోడను కూల్చివేయాలంటూ హైడ్రాకు ఏ ఆధారాలతో లేఖ రాశారని శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను హైకోర్టు నిలదీసింది. 
 
నోటీసు ఇవ్వకుండా, వివరణకు అవకాశం కల్పించకుండా కూల్చివేతలకు దిగడంపై హైడ్రాతో పాటు తహసీల్దార్‌ వ్యవహారాన్ని తప్పుబట్టింది. కొండాపూర్‌లోని 350 చదరపు గజాల ప్లాటుకు చెందిన కాంపౌండ్‌ గోడ, వాచ్‌మన్‌ గదిని హైడ్రా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ పెమ్మసాని సుధారాణి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు.