పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి

పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి
సహచర ట్రెనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదు నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్ద  అదుపులోకి తీసుకొనిఅత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  కరపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
ఈ కేసు దర్యాప్తును ఉమెన్స్ సేఫ్టీ వింగ్‌కు నగర పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ బదిలీ చేశారు. ఉదయ్ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు నాలుగు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ కేసు దర్యాప్తు అధికారిగా చార్మినార్ మహిళా పోలీస్స్టేషన్ సీఐ జ్యోత్స్న, కేసు పర్యవేక్షణ అధికారిగా మహిళా భద్రత విభాగం డీసీపీ లావణ్యను నియమించారు. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
మరోవైపు తనపై అత్తాపూర్ ఠాణాలో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ బుధవారం  హైకోర్టులో జరగనుంది.  ఉదయ్ కృష్ణారెడ్డి ఈ నెల 21న ఈ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వాదనలు విన్న హైకోర్టు అదనపు పీపీ జితేందర్ రావు వివరాలు సమర్పించడానికి సమయం కోరడంతో తదుపరి విచారణ మరోసారి బుధవారానికి వాయిదా వేసింది. 
హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపులు, బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డిపై ఈ నెల 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.  ఉదయ్‌ కృష్ణారెడ్డి అసభ్యకర మెసేజ్‌లు పంపాడని, తన ఫోన్‌ లాక్కొని పాస్‌వర్డ్‌ చెప్పాలని బెదిరించాడని పేర్కొన్నారు. అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
మరోవైపు తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు అవాస్తవమంటూ ఉదయ్‌ కృష్ణారెడ్డి ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు.  అనంతరం మోతీనగర్‌లోని బంధువు ఇంటికి వచ్చిన ఉదయ్‌ కృష్ణారెడ్డి ఉదయం మద్యం తాగి అపస్మారక స్థితిలో వెళ్లాడు. కానీ ఆత్మహత్యప్రయత్నం చేసి, ఆసుపత్రి పాలైనట్లు ప్రచారం జరిగింది.
అయితే ఇదంతా నాటకమని, సానుభూతి కోసమే ఇలా చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఉదయ్, ఈ నెల 22న హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జి అయ్యారు. తాజాగా అతడి ఆచూకీ లభించడం లేదంటూ పోలీసులు చెప్పడం గమనార్హం.