వైదులు అందించే సేవలు దేశానికీ చేసే సేవ 

వైదులు అందించే సేవలు దేశానికీ చేసే సేవ 
వైద్యులు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని పేర్కొంటూ  రోగికి చేసే వైద్యం ఒక వ్యక్తికే కాకుండా సమాజానికి, దేశానికి చేసే సేవగా భావించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాoచందర్ రావు సూచించారు. బిజెపి డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కేటాయిస్తోందని తెలిపారు. 
 
జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలలో అవసరమైన మందులు, పరికరాలు, సిబ్బంది జీతాల వరకు మెజారిటీ నిధులను కేంద్రమే అందిస్తోందని చెప్పారు. కరోనా సమయంలో భారత్ బయోటెక్ స్వదేశీ వ్యాక్సిన్ రూపొందించడానికి ప్రధాని మోదీ అందించిన ప్రోత్సాహమే కారణమని కొనియాడారు. స్వచ్ఛభారత్ పరిసరాల పరిశుభ్రతకే కాక ‘స్వస్థ్ భారత్’ సాధనకు పునాదిగా నిలిచిందని తెలిపారు. 
 
ఖేలో ఇండియా, అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా ప్రతిఒక్కరిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని చెప్పారు. సోషల్ మీడియా (వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్)లో వచ్చే అనధికారిక వైద్య సలహాలు, చిట్కాలను నమ్మి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని, తప్పనిసరిగా అర్హులైన డాక్టర్ల సలహాలు మాత్రమే పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కార్గిల్ యోధుల త్యాగాలు స్మరణీయం 

కాగా, కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ సరిహద్దులను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఆయన ఘన నివాళులర్పించారు. యువతలో జాతీయ భావం పెంపొందాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని వీర సైనిక స్మారక స్థూపం వద్ద రాంచందర్ రావు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. 

 
కార్గిల్ విజయ్ దివస్ భారత సైన్యం అజేయ ధైర్యానికి, అసమాన పరాక్రమానికి, చెక్కుచెదరని సంకల్పానికి, దేశం పట్ల ఉన్న అత్యున్నత అంకితభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. కార్గిల్‌లోని దుర్భేద్యమైన శిఖరాలపై మన వీర జవాన్లు అసాధారణ శౌర్యాన్ని ప్రదర్శించి, త్రివర్ణ పతాక గౌరవాన్ని, దేశ ప్రతిష్ఠను కాపాడుతూ భారత చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. 
 
మాతృభూమి రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర జవాన్లకు వినమ్ర నివాళులు అర్పిస్తున్నామని, దేశ సరిహద్దులను అహర్నిశలు కాపాడుతున్న భారత సైనికులందరికీ శిరసు వంచి వందనం చేస్తున్నామని తెలిపారు. మన వీరపుత్రుల త్యాగం, అమరత్వం, దేశం పట్ల వారి అపూర్వ అంకితభావం ప్రతి భారతీయుడిలో, ముఖ్యంగా యువతలో, దేశభక్తిని, జాతీయ సేవాభావాన్ని తరతరాలకు ప్రేరేపిస్తూనే ఉంటుందని తెలిపారు.