మణిపూర్ హింసాకాండకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేయడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రతిపాదించింది. 2023లో చెలరేగిన హింసాకాండకు సంబంధించిన కేసుల్లో బాధితుల కుటుంబాలకు ఇంకా ఛార్జ్షీట్లు అందలేదని గమనించిన తర్వాత, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చీ, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ ప్రతిపాదన చేసింది.
“కొనసాగుతున్న దర్యాప్తులో ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగినందున, విచారణను రోజువారీ ప్రాతిపదికన చేపట్టేలా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని మేము ప్రాథమికంగా ప్రతిపాదిస్తున్నాము. దీని కోసం మణిపూర్ ప్రభుత్వం, మణిపూర్, గౌహతి హైకోర్టులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది,” అని సిజెఐ కాంత్ పేర్కొన్నారు.
దర్యాప్తు పూర్తి చేయడంలో వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్న సీబీఐ, సిట్ లకు పూర్తి సహకారం అందించాలని కూడా అత్యున్నత న్యాయస్థానం మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
“…సిబిఐ, సిట్ మరియు SIలు దర్యాప్తును పూర్తి చేసి, తమ ఛార్జ్షీట్లను దాఖలు చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి, అడ్డంకులు ఉన్నప్పటికీ, ఈ రెండు సంస్థలు తమ వంతు కృషి చేసి దర్యాప్తును పూర్తి చేయాలని మేము నొక్కి చెబుతున్నాము,” అని సిజెఐ తెలిపారు. మణిపూర్‌లోని 8 జిల్లాల్లో హింసకు సంబంధించిన 3,020 కేసులను సిట్ లు దర్యాప్తు చేస్తున్నాయని సుప్రీంకోర్టు గుర్తించింది. అయితే, కేవలం 301 కేసుల్లో మాత్రమే ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి.
41 కేసుల్లో మాత్రమే అభియోగాలు నమోదు చేయబడ్డాయి . 10 కేసుల్లో విచారణ ప్రారంభమైంది. “ఈ కేసులన్నింటిలోనూ విచారించాల్సిన సాక్షులు 2,924 మంది ఉన్నారు,” అని కోర్టు పేర్కొంది. తమకు బదిలీ చేసిన 31 కేసులలో 21 కేసులకు సంబంధించి ఛార్జ్షీట్లు దాఖలు చేశామని, 11 కేసులలో అదనపు దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ కోర్టుకు తెలిపింది. అలాగే, 6 కేసులలో ముగింపు నివేదికలు దాఖలు చేశామని, వాటిలో 3 ఆమోదం పొందాయని, 4 కేసులు ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయని ఆ సంస్థ వివరించింది.
అస్థిరమైన శాంతిభద్రతల పరిస్థితుల కారణంగా కేసుల దర్యాప్తును పూర్తి చేయడంలో ఎదురవుతున్న సవాళ్లను ఆ సంస్థ ప్రస్తావించింది. సాక్షులలో చాలా మంది నిరాశ్రయులయ్యారని, అందువల్ల వారిని విచారించడం కష్టంగా ఉందని కోర్టుకు తెలిపింది. “అవిశ్వాసం కారణంగా సాక్షులు సహకరించడానికి నిరాకరిస్తున్నారు. అనేక ప్రాంతీయ మాండలికాలు ఉండటం వల్ల భాషాపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇది స్థానిక నివాసితులు, సాక్షులతో సమర్థవంతంగా సంభాషించడానికి గణనీయమైన ఆటంకంగా మారింది,” అని సీబీఐ పేర్కొంది.
ఇంటర్నెట్ సేవలను దీర్ఘకాలం పాటు నిలిపివేయడం డిజిటల్ సాక్ష్యాల సేకరణకు ఆటంకం కలిగించిందని, అలాగే స్వేచ్ఛా సంచారంపై ఆంక్షలు క్షేత్రస్థాయి దర్యాప్తు నిర్వహణకు కూడా ఆటంకం కలిగించాయని ఆ ఏజెన్సీ తెలిపింది. దర్యాప్తు సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను కోర్టు విన్నది, కానీ దర్యాప్తును సహేతుకమైన సమయంలో పూర్తి చేయాలని నొక్కి చెప్పింది. దర్యాప్తుపై తాజా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు కోరింది.
దర్యాప్తు పెండింగ్‌లో ఉన్న లేదా ఛార్జిషీట్లు దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్ల వివరాలను క్రోడీకరించాలని సీబీఐ, రాష్ట్ర సిట్, మహారాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దత్తాత్రేయ పడ్సల్గికర్ నేతృత్వంలోని కోర్టు నియమించిన పర్యవేక్షణ కమిటీని ఆదేశించింది.
“దీనివల్ల ఎన్ని విచారణలు నిర్వహించాల్సి ఉంటుందనే దానిపై ఒక అంచనా వస్తుంది. మేము ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రత్యేక కోర్టుల సంఖ్యను నిర్ధారించడానికి ఈ సమాచారం తక్షణమే అవసరం,” అని కోర్టు పేర్కొంది. హింసాకాండ చెలరేగినప్పటి నుండి అదృశ్యమైన 30 మందికి సంబంధించిన కేసులను పరిశీలించాలని మణిపూర్ హైకోర్టును కూడా అది ఆదేశించింది.

More Stories
నీట్, జేఈఈ నిర్వహించే ఎన్టీఏలో 47 మంది తొలగింపు
రాజ్యసభలో ‘వందే మాతరం’కు చట్టపర హోదా కల్పిస్తూ బిల్లు
లీకేజీకి పాల్పడితే 10 ఏళ్ల జైలు, రూ. రూ. 10 కోట్ల వరకు జరిమానా