“పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానం. అప్పుడే ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుపై ప్రజల్లో నమ్మకం, గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయాలి.. ప్రశ్నించాలి.. సమస్యలను లేవనెత్తాలి. అంతేకానీ చట్టసభలు నడవకుండా అడ్డుకోవడం సరికాదు. ఒకప్పటి రాజకీయాలు చాలా హుందాగా ఉండేవి. కానీ ఈ తరం రాజకీయాలు, రాజకీయ విలువలు దిగజారుతున్నాయి. ఇది భవిష్యత్ తరాలకు తప్పుడు సందేశాన్ని ఇచ్చినట్లవుతుంది” అంటూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
`సంసద్ రత్న’ అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చొక్కాలు విప్పామని ఒక పార్టీ, విప్పించామని మరోపార్టీ సంబరపడుతోందని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు తెస్తుందని పేర్కొంటూ ప్రజలు రాజకీయ నాయకుల ప్రవర్తనను నిశితంగా గమనిస్తుంటారని హెచ్చరించారు. అందుకే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 16 మంది వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు ‘సంసద్ రత్న’ అవార్డులు అందజేశారు. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత్ మజూందార్, మాజీ సీజేఐ బీఆర్ గవాయ్, మాజీ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్, సీనియర్ పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
“ఒక రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నేను ఇవాళ ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇదంతా ప్రజాస్వామ్యం గొప్పతనం వల్లే సాధ్యమైంది. చట్టసభల్లో అటల్ బిహారీ వాజపేయి, పీవీ నరసింహారావు, మొరార్జీ దేశాయ్ లాంటి ఎందరో మహానుభావుల ప్రసంగాలు వింటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. నా జీవితంలో ఏనాడూ అసెంబ్లీ వెల్ లోకి అడుగుపెట్టలేదు. అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు కూడా గైర్హాజరు కాలేదు” అని కిషన్ రెడ్డి చెప్పారు.
తొలిరోజు నుంచి మొన్నటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల వరకు సెషన్ నడిచిన ప్రతిరోజూ సభకు హాజరయ్యానని పేర్కొంటూ పార్లమెంటులో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య అభిప్రాయ భేదాలుండటం సహజం అని తెలిపారు. ప్రభుత్వం తీరు నచ్చకపోతే విపక్షాలు సునిశితంగా విమర్శించాలని, లేదంటే వాకౌట్ చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెబుతుండేవారని గుర్తు చేశారు.
కానీ ఇటీవలి కాలంలో పరిస్థితులు మారిపోయాయి. స్పీకౌట్, వాకౌట్ కు బదులుగా పార్లమెంటులో గందరగోళం సృష్టించడంపైనే విపక్షాలు దృష్టిసారించాయని విచారం వ్యక్తం చేశారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం ఉంటుందని చెబుతూ ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో వివిధ అంశాలపై అవగాహన కూడా పెరిగిందని చెప్పారు. అన్నీ ఆలోచించే వారు ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటున్నారని స్పష్టం చేశారు.

More Stories
ఎర్రకోట పేలుడు సూత్రధారి ఉమర్ ఉన్ నబీ .. ఎన్ఐఏ ఛార్జిషీట్
అబ్దుల్లాలు పూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించడంపై కాంగ్రెస్ కన్నెర్ర
విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాది