ఇటీవల ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) అధికార ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వొచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న సమయంలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె ఎంపీ సుప్రీయా సూలే ప్రధాని నరేంద్ర మోదీని మంగళవారం కలిశారు. మోదీ-శరద్ పవార్ సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే ఈ భేటీ అనంతరం సుప్రియా సూలే ప్రతిపక్ష పార్టీల సమావేశంలోనూ పాల్గొనడం గమనార్హంగా మారింది. మరోవైపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంట్లో అవసరమైన రెండొంతుల మెజార్టీ సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) కూడా ఎన్డీఏకు మద్దతు ఇచ్చే అవకాశాలపై గత కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీ వద్ద 8 మంది ఎంపీలు ఉన్నారు. 50 శాతం సీట్లను పెంచుతామని రాతపూర్వకంగా ప్రభుత్వం హామీ ఇస్తే అప్పుడు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని ఇటీవల ఎన్సీపీ పేర్కొన్న విషయం తెలిసిందే.
మరో వైపు ఎన్డీఏ కూటమిలో శరద్ పవార్ పార్టీ చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇటీవల మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో భాగమైన శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దీంతో ఎంవీఏ కూటమిలో అంతర్గత రాజకీయ పరిణామాలపై చర్చ మొదలైంది.
ఈ పరిణామాల మధ్య శరద్ పవార్ కూడా శిందేను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే రెండుగా విడిపోయిన ఎన్సీపీ వర్గాలు మళ్లీ ఒక్కటై, అనంతరం ఎన్డీఏ కూటమిలో కొనసాగవచ్చనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

More Stories
రామమందిర వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక ధార్మిక కమిటీ
పార్లమెంటులో పరీక్షలపై చర్చకు ప్రభుత్వం సిద్ధం
మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు.. టీఎంసీ ఎంపీ సస్పెన్షన్