ఏజెండాలో లేకపోయినా పునర్విభజన బిల్లు తెచ్చే అవకాశం!

ఏజెండాలో లేకపోయినా పునర్విభజన బిల్లు తెచ్చే అవకాశం!
* టిఎంసి రెబెల్స్ ను ఆహ్వానించారని అఖిల సమావేశం నుంచి ప్రతిపక్షాలు వాకౌట్
నియోజకవర్గాల పునర్విభజన-మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించిన ఇంకా జాబితాలో చేర్చని అజెండాను ప్రవేశపెట్టాలన్న స్పష్టమైన ఉద్దేశాన్ని ప్రభుత్వం ఆదివారం సూచనప్రాయంగా ప్రభుత్వం వెల్లడించింది. జాబితాలో లేని ఏ బిల్లునైనా తీసుకువస్తే ప్రతిపక్షాన్ని ఆశ్చర్యపరచబోమని కూడా స్పష్టం చేసింది.  లోక్‌సభ ఉప నాయకుడు రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, “సభ అజెండాలో మేము చేర్చిన ఎనిమిది బిల్లులు కాకుండా, పార్లమెంటుకు ఏదైనా అదనపు అజెండాను తీసుకువస్తే ప్రతిపక్షానికి తెలియజేస్తాము. ప్రతిపక్షాన్ని ఆశ్చర్యపరచము,” అని తెలిపారు. 
 
ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై రిజిజు స్పందిస్తూ, “ప్రతి పక్షానికీ ఒక అభిప్రాయం ఉంటుంది కానీ ఏ పక్షమూ మరొక పక్షాన్ని బలవంతం చేయలేదు. దీనిని బలవంతంగా రుద్దలేము. నా మాటే చెల్లుతుంది, లేకపోతే దారి లేదు అన్నట్లుగా ఉండదు. కాంగ్రెస్ కూడా సభలో సమస్యలను లేవనెత్తవచ్చు,” అని చెప్పారు. 
 
ముఖ్యంగా, ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలక మిత్రపక్షమైన డీఎంకే, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో నియోజకవర్గాల పునర్విభజన, 33% మహిళా రిజర్వేషన్‌లను అనుసంధానించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు కొత్త ముసాయిదాను పరిశీలించడానికి సుముఖతను సూచించింది.  “దక్షిణాది రాష్ట్రాలు ప్రతికూలంగా ప్రభావితం కాకూడదని మేము చెప్పాము. మేము ఇంకా ఒక వైఖరిని తీసుకోలేదు. ప్రభుత్వం ఏమి ప్రతిపాదిస్తుందో చూస్తాము,” అని రాజ్యసభలోని డీఎంకే నాయకుడు తిరుచి శివ పేర్కొన్నారు.
ఒకవేళ దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతే, నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్ల పాటు నిలిపివేసే విషయాన్ని పరిశీలించవచ్చని ఆయన తెలిపారు.  “ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురావాలి,” అని వామపక్ష నాయకుడు జాన్ బ్రిట్టాస్ స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులతో ప్రభుత్వం సంప్రదింపులు జరపకపోవడాన్ని ఆయన విమర్శించారు.  రాజ్‌నాథ్ వెళ్లి వారిని కలవాలని కోరారు. “వారు మన ప్రజలే కానీ శత్రువులు కాదు,” అని రాజ్యసభలోని సీపీఎం నాయకుడు బ్రిట్టాస్ స్పష్టం చేశారు.
 
నిరంకుశత్వాన్ని రుద్దడమే దీని ఉద్దేశ్యమని పేర్కొంటూ, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఎస్పీ పునరుద్ఘాటించింది. ఈ విషయంపై అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రామ మందిర దొంగతనం, సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష, పత్రాల లీకులు, ఇంధనంలో ఇథనాల్ కలపడం, మణిపూర్ ఉద్రిక్తతలు వంటి పలు అంశాలపై చర్చించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. 
 
తాము అన్ని విషయాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రతిపక్షం సమావేశ కార్యకలాపాలకు ఆటంకం కలిగించకూడదని ప్రభుత్వం పేర్కొంది. మరోవంక,  ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ అనే అంతగా ప్రాచుర్యం లేని సంస్థలో విలీనమైన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)లోని అసమ్మతి వర్గాన్ని ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడంతో, ప్రతిపక్షాలు ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ‘ఇండియా’ కూటమి సమావేశాలకు హాజరుకాని డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా వాకౌట్ చేసిన పార్టీలలో ఉన్నాయి.

ప్రభుత్వ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ సౌగత రాయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోక్‌సభ స్పీకర్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక గుర్తింపు లేని విభాగానికి ప్రాధాన్యత ఇవ్వడం పార్లమెంటరీ నియమాలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో సదరు రెబల్ ఎంపీలు ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులుగానే కొనసాగుతున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు వారికి ప్రత్యేక పార్టీ హోదాలో ఆహ్వాన పత్రికలు ఎలా పంపుతారని ఆయన ప్రశ్నించారు.

 అఖిలపక్ష సమావేశాన్ని విపక్షాలు వాకౌట్ చేయడం​పై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిస్థాయి బహిష్కరణ కాదని, కేవలం సింబాలిక్ నిరసన మాత్రమేనని పేర్కొన్నారు. సమావేశం మొత్తం సానుకూల వాతావరణంలో సాగిందని తెలిపారు. అలాగే వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు మొత్తం ఎనిమిది బిల్లులను జాబితా చేసినట్లు పేర్కొన్నారు.
 
ఎన్‌సీపీఐకి చెందిన 20 మంది లోక్‌సభ సభ్యులు కొత్త పార్టీతో అనుబంధం కోరుతూ స్పీకర్‌కు లేఖ ఇచ్చారని, వారికి ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు రిజిజు తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం స్పీకర్ పరిశీలనలో ఉందని చెప్పారు. అలాంటి పరిస్థితిలో ఆ ఎంపీలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించకుండా ఎలా ఉండగలమని ప్రశ్నించారు.