మధ్య ప్రదేశ్ లో ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా బిల్లు సిద్ధం

మధ్య ప్రదేశ్ లో ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా బిల్లు సిద్ధం
మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆదివారం నాడు, ఉమ్మడి పౌర  స్మృతి  ముసాయిదా బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ట్రిపుల్ తలాక్, ‘నికాహ్ హలాలా’లను నేరంగా పరిగణిస్తుంది. బహుభార్యత్వాన్ని నిషేధిస్తుంది. సహజీవన సంబంధాలను నెలలోపు నమోదు చేసుకోకపోతే మూడు నెలల జైలు శిక్షను ప్రతిపాదిస్తుంది. ఈ బిల్లును సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.

ఇది వివాహిత తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలకు, వారు కన్నబిడ్డలైనా, దత్తత తీసుకున్నవారైనా, లేదా సరోగసీ లేదా ఏఆర్టీ ద్వారా జన్మించినవారైనా, సమాన చట్టపరమైన హక్కులను, వారి వైవాహిక స్థితితో సంబంధం లేకుండా పిల్లలందరికీ సమాన వారసత్వ హక్కులను ప్రతిపాదిస్తుంది. అయితే, షెడ్యూల్డ్ తెగలకు ఈ బిల్లు పరిధి నుండి మినహాయింపు ఇస్తుంది. 

 
ప్రతిపాదిత చట్టం ప్రకారం, సహజీవనం ద్వారా జన్మించిన పిల్లలకు చట్టపరమైన హోదా లభిస్తుంది. ఒకవేళ పురుషుడు స్త్రీని విడిచిపెడితే, ఆమె చట్టబద్ధమైన భార్యలాగే సంబంధిత న్యాయస్థానం ద్వారా భరణం కోరవచ్చు. అంతేకాకుండా, గిరిజన వర్గాలను మినహాయించి, అన్ని మతాల వారికి వివాహాలు, విడాకులను నమోదు చేయడాన్ని ఇది తప్పనిసరి చేస్తుంది.
 
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)తో ఇకపై రామ్, రహీమ్, రాబిన్లకు సమాన హక్కులు లభిస్తాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. “ఈ రోజు మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఉమ్మడి పౌర స్మృతి బిల్లు, 2026కు ఏకగ్రీవంగా, హృదయపూర్వకంగా ఆమోదం తెలిపింది. రాజ్యాంగబద్ధమైన సమానత్వానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ బిల్లు చారిత్రక భారతీయ సంస్కృతికి, విలువలకు కట్టుబడి ఉంది. జులై 20 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో ఈ యూసీసీ బిల్లును ప్రవేశపెడతాం” అని ప్రకటించారు. 

ఉమ్మడి పౌర స్మృతికి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందని, రాష్ట్ర జనాభాలో 93 శాతం కంటే ఎక్కువ మంది ఈ చట్టానికి మద్దతు ఇస్తున్నారని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. ముస్లిం సమాజంలోని మెజారిటీ మహిళలు ఈ యూసీసీ చట్టానికి అనుకూలంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. 
ముస్లిం పురుషుల్లో 40 శాతం మంది మ‌ద్ద‌తు ఇచ్చార‌ని చెబుతూ ఈ బిల్లుపై జ‌రిగిన చ‌ర్చ‌లో ప‌లు రాజ‌కీయ పార్టీలు పాల్గొన్నాయ‌ని, కానీ, కాంగ్రెస్ మాత్రం పాల్గొన‌లేద‌ని ధ్వజమెత్తారు. 

సమాజంలోని వివక్షను తొలగించడానికి, అన్ని వర్గాలను ఒకే చట్టపరమైన ఛత్రం కిందికి తీసుకురావడానికి ఈ యూసీసీ చట్టాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.