దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌ పవర్డ్‌ రైలును ప్రధాని మోదీ శుక్రవారం హర్యానాలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హర్యాలోని జింద్‌, సోనిపట్‌ మధ్య (89 కి.మీ) నడవనుంది. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనాన్ని కాపాడుకోవడానికి రైల్వే వ్యవస్థలో ఇది ఒక చరిత్రాత్మక ముందడుగు అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేయడం దేశ గర్వకారణమని వెల్లడించారు.

ప్రపంచంలో మూడు లేదా నాలుగు దేశాలలో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు ఉన్నాయని చెప్పారు. అధునాతన రైల్వే ఇంజినీరింగ్‌లో దేశ సామర్థ్యాలకు ఇది నిదర్శమని కొనియాడారు. 10 కోచ్‌లతో అందుబాటులోకి తెచ్చిన ఈ హైడ్రోజన్‌ రైలు హరియాణాలోని జింద్‌-సోనిపత్‌ స్టేషన్ల మధ్య నడుస్తుంది. ఈ రైలు వారానికి ఆదివారం మినహా ఆరు రోజులు నడవనున్నట్లు అధికారులు వెల్లడించారు.  
ప్రతి ఆదివారం షెడ్యూల్డ్ నిర్వహణ, సాంకేతిక తనిఖీల కోసం దీనిని దిల్లీలోని షకుర్‌బస్తి వర్క్‌షాప్‌నకు పంపుతారని తెలిపారు. జింద్ సిటీ, పాండు పిండారా, లలిత్ ఖేడా, భంబేవా, ఇషాపుర్ ఖేరి, బుటానా, ఖండ్రాయ్, గోహానా, రభ్రా, లాత్, మోహనా, హరియాణా, బర్వాస్ని స్టేషన్లలో స్టాపులు ఉంటాయని వివరించారు.

“హైడ్రోజన్ ​ రైలుతో హరియాణా పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. భారత రైల్వే రూపురేఖలు మార్చడంతో ఇది కీలకమైన ముందడుగు. మిగతా దేశాల హైడ్రోజన్ రైళ్ల కంటే ఈ రైలుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మా ప్రభుత్వం రూ.14 వేల కోట్లతో రైల్వే, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టింది. భవిష్యత్తులో మరిన్ని హైడ్రోజన్‌ రైళ్లు వస్తాయి” అని ప్రధాని తెలిపారు. 

2014 వరకు రైల్వేలో విద్యుదీకరణ 30 శాతం మాత్రమే ఉందని, తాము వచ్చాక 12 ఏళ్లలో రైల్వేలో విద్యుదీకరణ 99 శాతానికి పెంచామని చెప్పారు.  తాము ఏం చేసినా ముందుచూపుతోనే పనిచేస్తామని పేర్కొంటూ హరియాణాలోని డబుల్ ఇంజిన్ సర్కారు గొప్పగా పనిచేస్తోందని కొనియాడారు. 

జింద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ తొలుత హైడ్రోజన్ రైలు నమూనాను ప్రదర్శించారు. అనంతరం జింద్‌ నుంచి సోనిపట్‌కు బయలుదేరిన తొలి హైడ్రోజన్‌ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జింద్‌ నుంచి సోనిపట్‌కు 89 కిలోమీటర్ల దూరం ఉండగా, ఈ రైలు కేవలం రెండు గంటల్లోనే చేరుకుంటుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. 

రైలును ప్రారంభించిన ప్రధాని అందులో ఉన్న సిబ్బందికి, తొలిసారిగా అందులో ప్రయాణించిన విద్యార్థులకు చేయి ఊపి పంపించారు. జింద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రజలు, విద్యార్థులను పలకరిస్తూ మోదీ అభివాదం చేశారు.