ఇస్రోలో కలకలం రేపుతున్న 120 మంది శాస్త్రవేత్తలు రాజీనామా

ఇస్రోలో కలకలం రేపుతున్న 120 మంది శాస్త్రవేత్తలు రాజీనామా
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో శాస్త్రవేత్తల నెల రోజులలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. ఒకరు ఇద్దరు కదా ఏకంగా 120 మంది రాజీనామాలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. చంద్రయాన్-3 మిషన్ విజయంతో యావత్తు ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఇస్రో లో ఈ పరిణామం ఆందోళనకు గురిచేస్తోంది. పలు ప్రతిష్ఠాత్మక మిషన్లపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 
 
స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలపై నిబంధనలను కఠినతరం చేస్తూ ఇస్రో ప్రధాన కేంద్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. జులై 14న యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వంటి కేంద్రాలకు జారీ చేసిన అంతర్గత మెమోలో భారత్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్‌యాన్‌తోపాటు ఇతర ‘ముఖ్యమైన మిషన్లు’కు అనుబంధంగా పని చేస్తున్న గ్రూప్- ఏ శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది నుంచి వచ్చే రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనలు యథావిధిగా అంగీకరించవద్దని స్పష్టం చేసింది. 
 
ఉద్యోగుల రాజీనామాతో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. రాజీనామాలను ఇకపై సాధారణ పరిపాలనా ప్రక్రియగాపరిగణించరు. ఇప్పటి వరకు సంబంధిత కేంద్రాల డైరెక్టర్లు ఈ అభ్యర్థనలను ఆమోదించేవారు. కానీ, ఇకపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌ నుంచి తుది అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో నిర్ణయాధికారం కేంద్ర పరిధిలోకి వెళ్లిపోయింది. సైంటిస్ట్, ఇంజనీర్ అంతకంటే తక్కువ హోదాలో ఉన్నవారి రాజీనామా అభ్యర్థనలను, తుది నిర్ణయం కోసం ఆయా కేంద్రాల డైరెక్టర్లు స్పష్టమైన సిఫార్సులతో తమకు పంపాలని స్పష్టం చేసింది.
 
అయితే,  కేవలం పరిపాలనా కారణాలతోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని  కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్  చెప్పారు. ‘‘మరింత పరిణతి చెందిన స్థాయిలో నిర్ణయం తీసుకునేందుకు వీలుగా పరిపాలనా కారణాల వల్ల అలా చేశాం’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇస్రోలో చాలా మంది ఉద్యోగులు ఉన్నారని, కొందరు వెళ్లిపోతుంటే మరికొందరు కొత్తగా చేరుతుంటారని ఆయన తెలిపారు. ‘‘చాలా మంది వెళ్లారు, చాలా మంది వచ్చారు’’ అని చెబుతూ ఈ విషయంలో ఎలాంటి వివాదం లేదని ఆయన స్పష్టం చేశారు.  


సైంటిఫిక్, టెక్నికల్ సిబ్బంది రాజీనామా లేదా స్వచ్ఛంద పదవీ విరమణపై నిర్ణయం తీసుకునేలా ఇస్రో కేంద్రాల డైరెక్టర్లు, చీఫ్‌లకు అనుమతిస్తూ 2020లోని ఇచ్చిన పరిపాలనాపరమైన అధికారాన్ని తాజాగా రద్దుచేసింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్,నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ వంటి కేంద్రాలకు కూడా ఈ ఉత్తర్వు జారీ చేసింది.

బెంగళూరులోని యూఆర్‌ రావు స్పేస్ సెంటర్, తిరువనంతపురంలోని విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో రాజీనామా చేశారు. వీరిలో వీఎస్‌ఎస్‌సీలో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ III ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త విక్టర్ జోసెఫ్ కూడా ఉన్నారు. 

 
గగన్‌యాన్ మిషన్‌ ప్రయోగ వాహనమైన ఎల్‌విఎం3 ప్రాజెక్ట్‌కు చీఫ్‌గా సుమారు 13 నెలలు పనిచేసిన తర్వాత జోసెఫ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజీనామా చేసినట్లు సమాచారం. వీరి రాజీనామాలకు కారణాన్ని ఇస్రో అధికారికంగా వెల్లడించలేదు. కానీ, అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలను అనుమతిస్తూ 2020లో కేంద్రం తీసుకొచ్చిన స్పేస్ పాలసీనే కారణమని తెలుస్తోంది.  ఈ రాజీనామాలు చేసిన శాస్త్రవేత్తలు అంతా స్పేస్ స్టార్టప్‌లలో చేరుతున్నట్లు తెలుస్తున్నది.
 
ప్రైవేట్ రంగం వేగంగా విస్తరించడం, స్టార్టప్‌లు, ఏరోస్పేస్ సంస్థలు అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలకు ఆకర్షణీయ అవకాశాలు కల్పించడంతో వీరు అటువైపు చూస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 400కుపైగా స్పేస్ స్టార్టప్‌లు నమోదయ్యాయి. ఇవి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించగా, కేవలం 2025లోనే దాదాపు 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. పిక్సెల్, ధ్రువ స్పేస్, స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ వంటి కంపెనీలు ఈ పోటీలో ముందున్నాయి.