దేశవ్యాప్తంగా ఉగ్రవాద అణచివేత చర్యలను వేగవంతం చేసిన గుజరాత్ పోలీసుల యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న నిషేధిత జైషే మహమ్మద్ స్లీపర్ సెల్ టెర్రర్ మాడ్యూల్‌ను విజయవంతంగా ఛేదించింది. గుజరాత్‌లోని వివిధ జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.
బిలాల్ అబిద్ షేరా, మహమ్మద్ అయూబ్ కడివాల్, మహమ్మద్ షఫీ ముఖి, మహమ్మద్ హసన్ కరాడియా, మహమ్మద్ సునాసరగా వీరిని గుర్తించారు. ఈ ఐదుగురు నిందితులకు స్థానిక న్యాయస్థానం జూలై 24 వరకు పోలీసు కస్టడీ విధించడంతో జాతీయ, రాష్ట్ర నిఘా సంస్థలు విచారణను మరింత ముమ్మరం చేశాయి. ఈ ఆపరేషన్‌లో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే పట్టుబడిన ముఠా సభ్యులలో ఒకరికి పేలుడు పదార్థాల తయారీలో అత్యంత అధునాతన శిక్షణ ఉంది.
అతను నగరంలో అమర్చడానికి అత్యంత ప్రమాదకరమైన ‘టైమ్ బాంబు’ను అసెంబుల్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. బాంబు తయారీ పూర్తయ్యే ముందే ఖచ్చితమైన సమాచారంతో ఏటీఎస్ బృందాలు దాడులు జరిపి నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. గతంలో వీరంతా కలిసి ఒక ఐఈడీ బాంబును ప్రయోగాత్మకంగా పరీక్షించారని, అయితే వారి తొలి ప్రయత్నం విఫలమైందని కోర్టుకు సమర్పించిన నివేదికలో స్థానిక ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.
“గుజరాత్ ఏటీఎస్ దర్యాప్తులో ఐదుగురి పేర్లు బయటకొచ్చాయి. నిందితులలో ఒకరు టైమ్ బాంబును తయారు చేయడానికి ప్రయత్నించినట్లు తేలింది. అతడి వద్ద జైషే మహ్మద్ ప్రచార సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అంతకుముందు అరెస్టైన ఎనిమిది మందిలో ఒకరైన అమీన్ అనే వ్యక్తి, తాజాగా అరెస్టైన నిందితులకు బాంబు తయారీ సామగ్రిని సరఫరా చేశాడు” అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీఆర్ దంతానీ పేర్కొన్నారు.
నిందితుల నుంచి ఉర్దూ భాషలో ఉన్న తీవ్రవాద సాహిత్యం, సాంకేతిక మాన్యువల్స్, దాచి ఉంచిన బాంబు తయారీ సామాగ్రిని రికవరీ చేయడానికి ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌లో ఉన్న అబ్దుల్లా, మహమ్మద్ ఉమర్ అనే ఉగ్రవాద హ్యాండ్లర్లతో ఈ స్లీపర్ సెల్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని విచారణలో తేలింది. స్థానిక యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, భారీగా నిధులు వసూలు చేయడం వీరి ప్రధాన లక్ష్యం.
ఈ ముఠాకు పాకిస్థాన్ నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయని, దేశంలో పేలుళ్లకు ఉపయోగించేందుకు ఒక పాత కారును కొనుగోలు చేయాల్సిందిగా పాక్ హ్యాండ్లర్ ఆదేశించినట్లు దర్యాప్తులో తేలింది. అధికారులు వారి నుంచి దాదాపు 250కి పైగా జిహాదీ డిజిటల్ ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ‘దారుల్ ఇస్లాం గుజరాత్ జైషే మహమ్మద్’ పేరుతో నడుస్తున్న ఈ స్లీపర్ సెల్‌పై జరిగిన మూడో విడత దాడుల్లో భాగంగా ఈ తాజా అరెస్టులు చోటుచేసుకున్నాయి.
దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన మొత్తం అనుమానితుల సంఖ్య 18కి చేరింది. అంతకుముందు గుజరాత్‌లోని బనస్కాంత, పటాన్, నవసారి జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో అర్ధరాత్రి వేళల్లో సాగిన మెరుపు దాడుల్లో ఎనిమిది మంది పట్టుబడగా వారిని విచారించగా వచ్చిన సమాచారంతో మరో ఐదుగురు, ఆ తర్వాత కీలక లింకుగా ఉన్న మరో నిందితుడిని అరెస్ట్ చేశారు.

More Stories
దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
జాతీయ గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు, ఫైన్
అమెరికా ఎన్నికల డేటాను చైనా తారుమారు?