ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్

ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు క్యాన్సర్ వల్ల శారీరక, మానసిక, ఆర్థిక పరమైన తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన “గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ కాన్సర్ 2026” ప్రకారం,  ఈ వ్యాధి వల్ల ప్రతి రోజూ 26000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఏడాదికి 2.60 కోట్ల కొత్త కేసులు నమోదవుతుండగా, దాదాపు కోటి మంది మరణిస్తున్నారు.
 
అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారు. గుండె జబ్బుల తర్వాత ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న రెండో పెద్ద వ్యాధి క్యాన్సర్ మాత్రమే.  అయితే, ప్రపంచవ్యాప్తంగా వచ్చే క్యాన్సర్ కేసులలో దాదాపు 40% (పదింటిలో నాలుగు) నివారించదగిన కారణాల వల్లే వస్తున్నాయి.  మనం ఇప్పుడే సరైన చర్యలు తీసుకోకపోతే, 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదయ్యే క్యాన్సర్ కేసుల సంఖ్య 3.5 కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.
ఈ పరిస్థితిని మార్చాలంటే కేవలం మందులు ఇవ్వడమే కాకుండా, రోగుల అవసరాలు, వారి అనుభవాలకు ప్రాధాన్యత నిచ్చేలా “ప్రజల-కేంద్రిత విధానాన్ని” తీసుకురావాలి. ఈ నివేదిక ప్రకారం ధనిక దేశాలకు, పేద దేశాలకు మధ్య వైద్య సదుపాయాల్లో భారీ వ్యత్యాసం ఉంది: ధనిక దేశాల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళల్లో 87% మంది 5 ఏళ్ల తర్వాత కూడా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కానీ పేద దేశాల్లో ఈ శాతం కేవలం 42% మాత్రమే.  ప్రపంచంలోని కేవలం మూడింట ఒక వంతు (1/3) దేశాలు మాత్రమే తమ ప్రభుత్వ ఆరోగ్య పథకాలలో క్యాన్సర్ చికిత్సను చేర్చాయి.
టాప్ 20 అత్యవసర క్యాన్సర్ మందులు ధనిక దేశాల్లో 68% నుంచి 94% అందుబాటులో ఉంటే, పేద దేశాలలో కేవలం 9% నుంచి 54% మాత్రమే అందుబాటులో ఉన్నాయి. “క్యాన్సర్ అనేది మనందరినీ ఏదో ఒక రూపంలో తాకే వ్యక్తిగత వ్యాధి. కానీ ఒక వ్యక్తి క్యాన్సర్ నుంచి బతుకుతాడా లేదా అనేది అతను ఎక్కడ పుట్టాడు, ఎంత సంపాదిస్తున్నాడు అనే దానిపై ఆధారపడకూడదు” అని డబ్ల్యూహెచో డైరెక్టర్ జనరల్  డాక్టర్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ తెలిపారు. 
 
క్యాన్సర్ కేవలం ఒక రోగిని మాత్రమే కాదు, వారి కుటుంబాల్ని కూడా అతలాకుతలం చేస్తోంది. 45% కంటే ఎక్కువ మంది క్యాన్సర్ రోగుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. 50% కంటే ఎక్కువ మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. రోగులను చూసుకునే వారు సమాజానికి దూరమై, ఎలాంటి ప్రతిఫలం లేని సేవలు చేస్తూ తీవ్ర అలసటకు లోనవుతున్నారు.
ప్రపంచ జనాభా ఎక్కువగా ఉన్న ఆసియాలోనే అత్యధికంగా 50.7% క్యాన్సర్ కేసులు, 56.5% మరణాలు సంభవిస్తున్నాయి.  ప్రపంచ జనాభాలో కేవలం 9% మాత్రమే ఉన్న ఐరోపాలో, ఏకంగా 21% కేసులు, 20% మరణాలు నమోదవుతున్నాయి. ఆఫ్రికాలో ఇక్కడ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, సరైన వైద్యం అందక మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది.
భారతదేశంలో నోటి క్యాన్సర్  పురుషుల్లో), రొమ్ము క్యాన్సర్ (మహిళల్లో), గర్భాశయ ముఖద్వార క్యాన్సర్  అత్యధికంగా నమోదవుతున్నాయి. మనదేశంలో కూడా వైద్య ఖర్చులు భరించలేక చాలా కుటుంబాలు అప్పులపాలు అవుతున్నాయి. అయితే ఆయుష్మాన్ భారత్, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పథకాల (ఉదాహరణకు ఆరోగ్యశ్రీ) ద్వారా ఉచిత క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారు.
 
క్యాన్సర్‌ను మొదటి లేదా రెండవ దశలోనే గుర్తిస్తే 90% పైగా నయం చేయవచ్చు. దీనికోసం క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాలి: 30 ఏళ్లు దాటిన వారు ప్యాప్ స్మియర్ (గర్భాశయ క్యాన్సర్ కోసం), 40 ఏళ్లు దాటిన వారు మేమోగ్రామ్ (రొమ్ము క్యాన్సర్ కోసం) పరీక్షలు చేయించుకోవాలి. నోటిలో తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు ఉంటే పురుషులు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
క్యాన్సర్ రహిత సమాజం కోసం ప్రపంచ దేశాలు ప్రధానంగా మూడు పనులు చేయాలని డబ్యూహెచ్ఓ కోరింది. ప్రతి దేశం ఉచిత ఆరోగ్య పథకాల్లో క్యాన్సర్ చికిత్సను చేర్చాలని,  రోగులకు, వారి కుటుంబాలకు ఆర్థిక మరియు సామాజిక భద్రత కల్పించాలని,  క్యాన్సర్ పరిశోధనల్ని పెంచి, కొత్త మందులు పేదవారికి కూడా తక్కువ ధరకే దొరికేలా చూడాలని సూచించింది.