పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 15 ఏళ్లపాటు తిరుగులేని ఆధిపత్యం వహించిన తృణమూల్ కాంగ్రెస్ లో అధికారం కోల్పోయిన రెండున్నర నెలలకే భారీ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. పార్టీకి ఎన్నో ఏళ్లుగా అండగా నిలిచిన సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా తిరుగుబాటు శిబిరంలో చేరుతున్నా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం తన మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.
తాజాగా టీఎంసీ సీనియర్ నేత, కమర్‌హాటి ఎమ్మెల్యే మదన్ మిత్రా తిరుగుబాటు వర్గంలో చేరడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. మూడు దశాబ్దాలకుపైగా మమతకు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ ఆవిర్భావం నుంచే కీలక నేతగా ఉన్న మదన్ మిత్రా తీసుకున్న నిర్ణయం టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులకు పాఠశాల నియామకాల కేసులో ఈడీ నోటీసులు జారీ కావడం, ఆ తర్వాత ఈ రాజకీయ పరిణామం చోటుచేసుకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కూడా మమత శిబిరాన్ని వీడి తిరుగుబాటు వర్గంలో చేరారు. పార్టీలో నిర్ణయాలన్నీ కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయని, సీనియర్ నాయకులకు ప్రాధాన్యం తగ్గిందని తిరుగుబాటు నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ చుట్టూ ఏర్పడిన నాయకత్వ వ్యవస్థపై వారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ విమర్శలను మమతాబెనర్జీ పూర్తిగా తోసిపుచ్చారు.
అభిషేక్ ఎలాంటి తప్పూ చేయలేదని, భవిష్యత్తులో కూడా ఆయన పార్టీకి కీలక నాయకుడిగానే కొనసాగుతారని మమత స్పష్టంచేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులు, బెదిరింపులకు బెదిరిపోకుండా పార్టీ కోసం నిలబడుతున్నదని చెబుతూ పరోక్షంగా ఆ విధంగా భయపడేవారే పార్టీ నుండి నిష్క్రమిస్తున్నారనే సంకేతం ఇస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడానికి బీజేపీ పోలీసులను, కేంద్ర ఏజెన్సీలను వాడుకుంటోందని ఆరోపించిన ఆమె, “ద్రోహుల తరఫున” ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బెదిరింపులకు లొంగకుండా పులిలా పోరాడుతున్నాడని చెబుతూ అతనికి గట్టి మద్దతు తెలిపారు. “ఈ రోజు అభిషేక్ మీకు (తిరుగుబాటు టీఎంసీ నాయకులకు) చాలా చెడ్డవాడు. అతని భార్య పిల్లలతో కలిసి సీబీఐకి వెళ్లిన విషయం మీకు గుర్తులేదా? అతను రాజీ పడి ఉపశమనం పొందగలిగేవాడు. అతను ఏదైనా తప్పు చేసి ఉంటే, పులిలా పోరాడుతున్నందువల్ల దానిని అధిగమించాడు,” అని మమతా మేనల్లుడికి సంఘీభావం ప్రకటించారు.
కొంతమంది పార్టీని వీడినా, టీఎంసీ బలహీనపడదని, నమ్మకమైన కార్యకర్తలు, ప్రజలే తమ అసలు బలమని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఎదుర్కొన్న పరాజయం తర్వాత పార్టీలో అసంతృప్తి మరింత పెరుగుతున్నట్లు పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష, భవిష్యత్తు వ్యూహంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుకు దారితీసిందని అంటున్నారు. మరోవైపు తిరుగుబాటు వర్గం పార్టీ గుర్తు, సంస్థాగత హక్కులపై కూడా పోరాటం కొనసాగిస్తోంది. ఈ అంశం ఎన్నికల సంఘం వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కాగా,గతంలో మాదిరిగా ఆమె నేరుగా జనం మధ్యకు వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. ఎక్కువగా రాష్ట్ర రాజధానికి, ఆన్ లైన్ సమావేశాలకు పరిమితం అవుతున్నారు. తన వెంట ఇదివరకటి మాదిరిగా పెద్ద ఎత్తున జనం తరలి రాకపోవచ్చని అభిప్రాయంతోనే ఆమె బహిరంగ నిరసనలకు వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. పార్టీపై తమకే అసలు హక్కు ఉందని తిరుగుబాటు నేతలు వాదిస్తుండగా, అధికారిక టీఎంసీ మాత్రం ఆ వాదనను ఖండిస్తోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య మమతాబెనర్జీ పార్టీని తిరిగి బలోపేతం చేయడంపైనే దృష్టిపెట్టారు. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, సంస్థాగతంగా పార్టీని పునర్నిర్మించాలని నాయకులకు సూచించినట్లు సమాచారం.

More Stories
దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ఐదుగురు జైషే మహమ్మద్ టెర్రరిస్టులు అరెస్టు
జాతీయ గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు, ఫైన్