రేపే ప‌ట్టాలెక్క‌నున్న తొట్ట‌తొలి హైడ్రోజ‌న్ రైలు

రేపే ప‌ట్టాలెక్క‌నున్న తొట్ట‌తొలి హైడ్రోజ‌న్ రైలు
దేశంలో తొట్ట‌తొలి హైడ్రోజ‌న్ రైలు శుక్రవారం ప‌ట్టాలెక్క‌నున్న‌ది. హ‌ర్యానాలోని జింద్ నుంచి ఆ రైలు ప్రారంభంకానున్న‌ది. ప్ర‌ధాని మోదీ ఆ కొత్త రైలుకు ప‌చ్చ‌జెండా ఊప‌నున్నారు. హైడ్రోజ‌న్ రైలు భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించ‌నున్న‌ది. జింద్ నుంచి సోనిప‌ట్ మ‌ధ్య ఆ రైలు న‌డ‌వ‌నున్న‌ది. ఈ రెండు స్టేష‌న్ల మ‌ద్య 89 కిలోమీట‌ర్ల దూరం ఉంది. 
 
ఈ రైలులో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. గ‌రిష్టంగా 75 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్ట‌రీలో దీన్ని డిజైన్ చేశారు. ఫ్యూయ‌ల్ సెల్ డీపీఆర్ఎస్ విధానంలో రైలు న‌డ‌వ‌నున్న‌ది. 1200 కిలోవాట్ల ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్ ఆ రైలుకు ఉంటుంది. 2025లో జింద్‌-సోనిప‌ట మ‌ధ్య ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. 
 
మే 22వ తేదీన 10 కోచ్‌ల హైడ్రోజ‌న్ రైలు కోసం రైల్వే బోర్డు అనుమ‌తి ఇచ్చింది. హైడ్రోజ‌న్ ట్రైన్ నెంబ‌ర్ 74010 జింద్ రైల్వే స్టేష‌న్ నుంచి ఉద‌యం 740 నిమిషాల‌కు బ‌య‌లుదేరుతుంది. ఆ త‌ర్వాత సోనిపేట్‌కు 9.40 నిమిషాల‌కు చేరుకుంటుంది ఫ్యూయ‌ల్ సెల్స్ ఆధారంగా హైడ్రోజ‌న్ రైలు విద్యుత్త‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. హైడ్రోజ‌న్‌, ఆక్సిజ‌న్ మ‌ధ్య రియాక్ష‌న్‌తో విద్యుత్తు ఉత్ప‌త్తి అవుతుంది. 
 
ఆనోడ్‌పై హైడ్రోజ‌న్‌, క్యాథోడ్‌పై ఆక్సిజ‌న్ రియాక్ట్ అవుతుంది. ఆనోడ్‌లో హైడ్రోజ‌న్ క‌ణాలు ప్రోటాన్లు, ఎల‌క్ట్రాన్లుగా విభ‌జ‌న అవుతాయి. ప్లాటినం ఉత్ప్రేర‌కం ఆధారంగా ప్రోటాన్ల‌తో ఆక్సిజ‌న్ క‌లిసి వాట‌ర్‌గా మారుతుంది. ఈ విధానంలో రైలు ఇంజిన్ న‌డుస్తుంది. హైడ్రోజ‌న్ రైళ్ల‌ను 2018లో తొలిసారి జ‌ర్మ‌నీలో ప్ర‌వేశ‌పెట్టారు. ఫ్రెంచ్ కంపెనీ ఆల్‌స్టామ్ వీటిని అభివృద్ధి చేశాయి. 
 
ఈ రైలు కోసం జింద్‌లో హైడ్రోజ‌న్ జ‌న‌రేష‌న్, రీఫ్యూయ‌లింగ్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేశారు. కంప్రెస్డ్ హైడ్రోజ‌న్ గ్యాస్‌ను నిల్వ చేసేందుకు పెట్రోలియం శాఖ లైసెన్సు జారీ చేసింది. మొత్తం 12 స్టేష‌న్ల‌లో రైలు ఆగుతుంది. జింద్ సిటీ, పాండు పిండ‌ర‌, ల‌లిత్ ఖేరా, భంబేవా, ఇషాపూర్ ఖేరి, బూటానా, ఖంద్రాయి, గోహ‌నా, ర‌బ్రా, లాత్‌, మోహ‌నా హ‌ర్యానా, భ‌ర్వాస్ని స్టేష‌న్ల‌లో ఆ రైలు ఆగ‌నున్న‌ది.శిలాజ ఇంధ‌నాల త‌ర‌హాలో హైడ్రోజ‌న్ మూడు రెట్ల శ‌క్తిని ఉత్ప‌త్తి చేస్తుంది. అయితే ప్ర‌స్తుతం ఈ విశ్వంలో హైడ్రోజ‌న్ ఎక్కువ స్థాయిలో ల‌భిస్తుంది. దీన్ని ఇంధ‌నంగా వాడితే, అది కేవ‌లం నీటి ఆవిరిని, వేడిని మాత్ర‌మే బై ప్రోడ‌క్ట్స్‌గా రిలీజ్ చేస్తుంద‌ని చెబుతున్నారు. దీని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం ప‌రిశుభ్రంగా ఉంటుంద‌ని భావిస్తున్నారు.