`ప్రశ్న’ రావణ్‌ బ్యాంకు ఖాతాలు రెండు నిలిపివేత

`ప్రశ్న’ రావణ్‌  బ్యాంకు ఖాతాలు రెండు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత, పరువు నష్టం కలిగించే వీడియోలు రూపొందిస్తున్నారనే ఆరోపణలపై వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అలియాస్ ‘ప్రశ్న రావణ్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఆయనకు చెందిన బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. 

`ప్రశ్న’  అనే మాధ్యమం ద్వారా విద్వేషాన్ని రెచ్చగొట్టే వీడియోలను పోస్ట్ చేస్తూ రావణ్ నెలకు రూ.1.5 లక్షలకు పైగా ఆర్జిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఆర్థిక లావాదేవీలను గుర్తించిన అధికారులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. రావణ్‌కు ఖాతాలు ఉన్న ఐసీఐసీఐ, యస్ బ్యాంకులకు పోలీసులు లేఖలు రాయడంతో, ఆయా బ్యాంకు యాజమాన్యాలు సదరు ఖాతాలను తక్షణమే నిలిపివేశాయి.

ఏలూరులో జరిగిన ఒక సభలో చేసిన వ్యాఖ్యలతో పాటు, రావణ్ రూపొందించిన పలు అభ్యంతరకర వీడియోలపై అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గతంలోనూ ఇదే తరహా ఆరోపణలపై ఆయన పలుమార్లు అరెస్టయ్యారు. తాజాగా  యుఎపిఎ  కింద నేరారోపణలు చేసిన గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. 

జులై 2వ తేదీన రావణ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను ప్రస్తుతం ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అందులోని వీడియోలు, తొలగించిన (డిలీట్ చేసిన) సమాచారం. ఇతర కీలక అంశాలను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక రావణ్‌ను ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? లేదా దీని వెనుక సూత్రధారులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో కూడా అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.