ఏపీలో ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించిన విజయసాయిరెడ్డి!

మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ) పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. విజయవాడలో బుధవారం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరు, జెండా, అజెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర రాజకీయాల్లో కుటుంబ ఆధారిత రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రకటించారు.

పరివర్తన రాజనీతి పార్టీ జెండాను తెలుపు, కాషాయ రంగులతో రూపొందించారు. జెండా మధ్యలో ధర్మచక్రాన్ని ఏర్పాటు చేశారు. పార్టీని సంక్షిప్తంగా  పీఆర్పీగా పిలవనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమం తమ పార్టీ ప్రధాన లక్ష్యాలని వివరించారు. రాజకీయాల్లో యువతకు 60 శాతం అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. 

యువతకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ రాజకీయాల్లో కొత్త తరానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. విద్య, ఉపాధి, వ్యవసాయం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, ప్రజల ఆదాయాలు మెరుగుపరిచే చర్యలు తమ అజెండాలో కీలక అంశాలని వివరించారు. 

రాయలసీమ పౌరుషం, ఆత్మగౌరవాన్ని కాపాడుతూనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష లేదని స్పష్టం చేశారు. శక్తి, సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు ఉన్న యువతలో సమర్థుడైన నాయకుడిని గుర్తించి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ను రెండు కుటుంబాలే పరిపాలించాలా? అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం స్పష్టమైన రాజకీయ శూన్యత ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ రాజకీయ తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని భావించి పీఆర్‌పీని స్థాపించినట్లు తెలిపారు.

 ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ చెమట, కష్టంతో పార్టీని నిలబెట్టారని, కుటుంబాలను సైతం పక్కనపెట్టి పార్టీ కోసం పని చేశారని, అందులో తాను కూడా భాగస్వామిని అయ్యానని తెలిపారు.

ప్రజల్లో మమేకం అయ్యే, ప్రజలతో కలిసి నడవాలనే కార్యకర్తలు లక్షమంది వైసీపీలో ఉన్నారని పేర్కొంటూ ప్రజలకు సేవ చేయాలనే బలమైన అభిప్రాయం ఉంటే వెంటనే వైసీపీని వీడాలని ఆయన సూచించారు. అలాంటి వారి కోసం తమ పీఆర్పీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని సాయిరెడ్డి చెప్పారు. ప్రజల కోసం పని చేసే వారికి పరివర్తన రాజనీతి పార్టీ ఎప్పటికీ స్వాగతం పలుకుతుందని చెబుతూ అహంకార, అహంభావ పూరక రాజకీయాలు తమ పరివర్తన రాజనీతి పార్టీలో ఉండబోవని, ఇక్కడ కార్యకర్తలే అధినాయకులని స్పష్టం చేశారు.

About The Author