మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత

సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు  (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన ఆయన, నియోజకవర్గ సమస్యలపై ఎప్పుడూ గళమెత్తేవారు.

ప్రజా సమస్యలపై ఆయన చూపిన పోరాట పటిమ కారణంగా  ‘ఉత్తరాంధ్ర టైగర్’, ‘మన్యం పులి’గా అభిమానుల చేత ఆప్యాయంగా పిలువబడే ఆయన మరణంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగిసినట్లయింది. 1948 ఆగస్టు 4న జన్మించిన శత్రుచర్ల విజయరామరాజు చినమేరంగి సంస్థాన కుటుంబానికి చెందినవారు. సంస్థాన వారసత్వ నేపథ్యం నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన, అంచెలంచెలుగా ఎదిగి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసారు. 

ఆయన  ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు పార్వతీపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఘనవిజయం సాధించారు. 1978లో జనతా పార్టీ తరఫున నాగూరు నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల్లోనూ కీలక పాత్ర పోషించారు.  1978లో నాగూరు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1983, 1985 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించారు.

శాసనసభలోనే కాకుండా పార్లమెంట్‌లోనూ తన ప్రాభవాన్ని చాటుకున్న విజయరామరాజు.. 1989, 1991లో పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 1998లో మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి 1999లో నాగూరు నుంచి, 2004లో పార్వతీపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ శాఖల మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2014 మార్చిలో టీడీపీలో తిరిగి చేరిన ఆయన, 2017 మార్చిలో శ్రీకాకుళం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై 2023 వరకు ఆ పదవిలో కొనసాగేశారు.

నాగూరు, పార్వతీపురం ప్రాంతాలతో పాటు చినమేరంగి సంస్థానానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాష్ట సానుభూతి తెలిపారు.

About The Author