నాటకరంగం శక్తివంతమైన మాధ్యమం

నాటకరంగం మన సంస్కృతికి ప్రతిబింబమని, సామాజిక చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తివంతమైన మాధ్యమమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ప్రయోగాలు చేపట్టడంతో పాటు, యువతను, కొత్త తరం కళాకారులను ప్రోత్సహించి ప్రేక్షకులను తిరిగి రంగస్థలం వైపు ఆకర్షించేందుకు సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు.

నటన ప్రదర్శన కళల పాఠశాల ఆధ్వర్యంలో విజయవాడలోని వేలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం మినీ ఆడిటోరియంలో “నేటి నాటకరంగం – సవాళ్లు, అవకాశాలు, గత వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి మార్గాలు” అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
 
విద్యావేత్త, సాంస్కృతిక కార్యకర్త, నటుడు డాక్టర్ ఎం.సి. దాస్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం అధ్యక్షుడు దోనేపూడి శంకర్, సుమధుర కళానికేతన్ ప్రధాన కార్యదర్శి పి.వి. భాస్కర శర్మ, దృశ్య వేదిక ఉపాధ్యక్షుడు దొంతాల ప్రకాశ్, విశ్రాంత ఆకాశవాణి వ్యాఖ్యాత మడుగుల రామకృష్ణ, కళాకారుడు, దర్శకుడు పిల్లా నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. 

ప్రస్తుతం నాటకరంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రదర్శనలకు ప్రేక్షకాదరణ పెంచే మార్గాలు, విద్యాసంస్థల్లో రంగస్థల కళలకు ప్రాధాన్యత, యువ కళాకారులకు శిక్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నాటక సమాజాలకు ఆర్థిక సహకారం, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రోత్సాహం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

నాటకరంగ అభివృద్ధికి కేవలం చర్చలు, అభిప్రాయాల వ్యక్తీకరణ సరిపోవని, ఆచరణాత్మక చర్యలు, నిరంతర శిక్షణా కార్యక్రమాలు, కళాకారులకు తగిన అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే రంగస్థల కళకు పూర్వవైభవం తీసుకురాగలమని వక్తలు అభిప్రాయపడ్డారు.
 
నటన పాఠశాల వ్యవస్థాపకుడు హేమాద్రి ప్రసాద్ ప్రముఖులకు స్వాగతం పలికారు. జి. సత్యానందిని కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వెనిగళ్ల భాస్కర్, ఎస్. అనిల్, ఈవన భాగ్యరాజ్ సదస్సు నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.
“రంగస్థలం బతకాలి – కళాకారుడు ఎదగాలి – ప్రేక్షకుడు మళ్లీ నాటకశాలకు రావాలి” అనే నినాదంతో నిర్వహించిన ఈ సదస్సు నాటకరంగ పునర్వైభవం కోసం సమష్టి కార్యాచరణకు నాంది పలుకుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

About The Author