హన్మకొండలో భూముల వేలం పాట చిలికి చిలికి గాలివానగా మారింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్టు గత వారం రోజులుగా కొనసాగుతుంది. తాజాగా ఈ పంచాయతీ తడి బట్టల ప్రమాణాలతో భద్రకాళీ మాత సన్నిధానానికి చేరి ఉద్రిక్తతలకు కారణమైంది. హన్మకొండ బస్టాండ్ సమీపంలోని ఏషియన్ మాల్ వెనుక ఉన్న రెండు ఎకరాల భూముల ప్లాట్లను 21వ తేదీన కుడా వేలం వేసింది.
ఈ బహిరంగ వేలంలో ఒక్కో గజం రూ. 75,000 నుంచి రూ 96,000 మధ్య పలికింది. అయితే ఈ వేలం పాటలో అవినీతి జరిగిందని మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఆరోపించారు. అక్కడ గజం రూ. 1.50 లక్ష పలుకుతుందని, చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలిసి అవినీతికి పాల్పడ్డారని, కోట్ల రూపాయల అవినీతి చేశారని ఆరోపణలు చేశారు.
కుడా భూముల వేలంలో అవినీతి జరిగిందని తడిబట్టలతో భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తానని, అవినీతి చేయకపోతే కాంగ్రెస్ నాయకులు తడిబట్టలతో భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు మర్రి యాదవ రెడ్డి. చెప్పినట్టుగానే బీఆర్ఎస్ నాయకులతో భద్రకాళి ఆలయానికి శుక్రవారం ఉదయం వచ్చి అక్కడే స్నానం చేసి తడి బట్టలతో ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ఆలయం వద్ద రాజకీయాలు చేయడం మంచిది కాదని నచ్చచెప్పి, మర్రి యాదవ రెడ్డిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోలీస్ వాహనాలను అడ్డుకోగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు కూడా భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు.
కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆలయం వద్ద స్నానం చేసి తడి బట్టలతో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పారదర్శకంగా పనిచేస్తున్న తమపై అనుచిత వ్యాఖ్యలు సరి కాదని హితవు చెప్పారు. ఆలయ శుద్ధికి రంగంలోకి మర్రి యాదవ్ రెడ్డి చేసిన సవాళ్లను స్వీకరించి తాను ఆలయం వద్దకు వచ్చానని, కబ్జాలు, అవినీతి చేసిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఎందుకు ఆలయం వద్దకు రాలేదంటూ ప్రశ్నించారు.
భద్రకాళి ఆలయం సాక్షిగా ఈ రెండు పార్టీలు చేసిన హంగామాని చూసి ఆలయాన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు అపవిత్రం చేశారని పేర్కొంటూ శనివారం బిజెపి నేతలు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నించారు.పసుపు నీళ్లతో ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. వీరిని అడ్డుకున్న పోలీసులు బలవంతంగా వీరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

More Stories
విశ్వశాంతి స్థాపనలో ప్రధాని మోదీ ఏకైక ఆశాకిరణం
మూసీ ప్రక్షాళనపై క్యాబినెట్ లో మంత్రుల వాడీవేడి చర్చలు
హైదరాబాద్ డీఎస్పీ రూ. 200 కోట్ల సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఏసీబీ