పురుషుల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి

పురుషుల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి

మహారాష్ట్రలోని పూణేకు చెందిన 26 ఏళ్ల కేతన్‌ అగర్వాల్‌ను కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ‘పురుషుల కోసం జాతీయ కమిషన్‌’ ఏర్పాటు చేయాలని ఒక ఎంపీ డిమాండ్‌ చేశారు. దీని కోసం గత పార్లమెంట్‌ సమావేశంలో ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ బిల్లును ఆయన ప్రస్తావించారు. 

ఆయన ఆప్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై  ఇటీవల బీజేపీలో చేరిన పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడైన అశోక్ కుమార్ మిట్టల్, కాగా, ‘పురుషుల కోసం జాతీయ కమిషన్’ ఏర్పాటు చేయాలన్న తన పిలుపును ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ మరోసారి పునరుద్ఘాటించారు. 

“పూణేకు చెందిన కేతన్ అగర్వాల్ కేసు తీవ్రంగా కలవరపరిచేది. కేతన్, అతడి కుటుంబం నిష్పాక్షికమైన, సమగ్రమైన, న్యాయమైన విచారణ, అన్నింటికంటే ముఖ్యంగా న్యాయానికి అర్హులు. నేను పార్లమెంటులో పురుషుల జాతీయ కమిషన్ బిల్లును ప్రవేశపెట్టాను. ప్రతి బాధితులకు న్యాయం, మద్దతు, చట్టం ముందు సమాన రక్షణ లభించాలి” అని ఆయన స్పష్టం చేశారు.  

“పురుషులు కూడా బాధితులు కాగలరని కేతన్ కేసు గుర్తు చేస్తుంది. మగవారికి కూడా సంస్థాగత మద్దతు, చట్టపరమైన రక్షణ, వారి గొంతు వినిపించే ఒక వేదిక అవసరం. లింగ భేదం లేకుండా న్యాయం అందరికీ సమానంగా జరుగాలి” అని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు.

అలాగే ‘జాతీయ మహిళా కమిషన్’ తరహాలో పురుషులకు కూడా ఒక జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ గత ఏడాది డిసెంబర్‌లో రాజ్యసభలో  ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు సంబంధించిన వీడియోను ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ షేర్‌ చేశారు. కేతన్‌ హత్య నేపథ్యంలో ‘పురుషుల కోసం జాతీయ కమిషన్‌’ ఏర్పాటు చేయాలన్న ఈ ప్రతిపాదిత ప్రైవేట్‌ బిల్లు ఇప్పుడు చర్చనీయంశమైంది.

అయితే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ఇలాంటి ప్రైవేట్ బిల్లులు కనీసం ఓటింగ్ దశకు కూడా చేరవు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇలాంటి 14 బిల్లులు మాత్రమే చట్టంగా మారాయి, 1970 నుంచి పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఏ ఒక్క ప్రైవేట్‌ బిల్లు ఆమోదం పొందలేదు.