గుజరాత్‌లో 8 మంది ‘జైషే’ ఉగ్రవాదుల అరెస్ట్

గుజరాత్‌లో 8 మంది ‘జైషే’ ఉగ్రవాదుల అరెస్ట్

గుజరాత్​లో భారీ ఉగ్రకుట్రను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) శుక్రవారం భగ్నం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న ‘స్లీపర్ సెల్’ నెట్‌వర్క్‌ను గుర్తించిన ఏటీఎస్ అధికారులు, దాడులు నిర్వహించి ఎనిమిది మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఏటీఎస్ అధికారులు నిర్వహించిన సోదాల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా నిందితుల మొబైల్ ఫోన్లలో వందల సంఖ్యలో డిజిటల్ ఫైళ్లను గుర్తించారు.

అరెస్ట్ అయిన వారిలో ఏడుగురు గుజరాత్‌కు చెందినవారు కాగా, ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందినవారు. వీరు రాష్ట్రంలో జైషే మహ్మద్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, కొత్త సభ్యులను చేర్చుకోవడానికి, ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, వారి కార్యకలాపాలపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

కొంతకాలంగా గుజరాత్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిఘా ఉంచిన ఏటీఎస్, అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తించింది. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రహస్యంగా సమావేశమవుతూ, ప్రజలను తీవ్రవాదం వైపు మళ్లించడం చేస్తున్నట్లు ఏటీఎస్ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.  ఈ నిందితులు కేవలం వ్యక్తిగత సభ్యులుగా మాత్రమే కాకుండా, ‘దారూల్ ఇస్లాం గుజరాత్ జైషే మహ్మద్’ అనే పేరుతో ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.

ఈ నెట్‌వర్క్‌కు పాకిస్థాన్ నుంచి మార్గనిర్దేశాలు అందుతున్నాయని అధికారులు నిర్దారణకు వచ్చారు.  అహ్మదాబాద్‌ను కేంద్రంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఈ ముఠా ప్రయత్నించినట్లు ఏటీఎస్‌ పేర్కొంది. ఈ మాడ్యూల్‌ గుజరాత్‌కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే ప్రయత్నం చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది.

అరెస్టు అయిన నిందితులు సరిహద్దుల అవతల ఉన్న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద హ్యాండ్లర్లు ‘అబ్దుల్లా, ‘మహ్మద్ ఉమర్’తో సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారు. జైషే మహ్మద్​కు చెందిన ఉర్దూ సాహిత్యాన్ని వీరు గుజరాతీ భాషలోకి అనువదించి, సోషల్ మీడియా, ఇతర ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా ప్రచారం చేయడం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ను చేపట్టడం సహా, ఉగ్రవాద కార్యకలాపాల కోసం వీరికి సుమారు రూ. 3 లక్షల ఆర్థిక సాయం పాకిస్థాన్ నుంచి అందినట్లు ఏటీఎస్ గుర్తించింది. 

నిందితుల్లో ముగ్గురు సిద్ధ్‌పుర్‌, చిఖ్లీ ప్రాంతాల్లోని మతపరమైన విద్యాసంస్థలకు చెందిన వారుగా ఏటీఎస్‌ గుర్తించింది. నిందితులకు దేశంలోని ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల్లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. అలాగే వారికి విదేశాల నుంచి నిధులు లేదా ఇతర సహకారం అందిందా? అనే అంశాన్ని కూడా ఏటీఎస్‌ అధికారులు పరిశీలిస్తున్నారు.