తెలంగాణ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా నియమించింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల కిందనే రిలీవ్ చేసింది.
ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సంజయ్ జాజును రిలీవ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఉద్యోగకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
తెలంగాణ కేడర్‌కు చెందిన సంజయ్ జాజు 992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మీ సేవతోపాటు పలు కీలక ఐటీ ప్రాజెక్టులను ప్రారంభించిన సంజయ్ జాజు 2014 నుంచి గత 12 ఏళ్లుగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 20218-2023 వరకు రక్షణ ఉత్పాదక శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ఆత్మనిర్భర్ భారత్‌ను రక్షణ రంగంలో అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కొంతకాలం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. మొన్నటి వరకు నార్త్ ఈస్ట్ రీజియన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంలో మూసీ ప్రాజెక్ట్, మెట్రో విస్తరణ, ప్రాంతీయ రింగ్ రోడ్డు వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు త్వరితగతిన సాధించడమే లక్ష్యంగా ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను ప్రత్యేకంగా నియమించినట్లు తెలుస్తోంది.
సంజయ్ జాజూ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన సమయంలో దేశంలోనే తొలిసారిగా ‘సౌకర్యం’ ప్రాజెక్టు ద్వారా మున్సిపల్ సేవలను ఆన్లైన్ చేశారు. saukaryam. org వెబ్సైట్ ద్వారా ఆస్తి పన్ను చెల్లింపులు, బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, వాటర్ బిల్లులు, భవన నిర్మాణ అనుమతలు ఇవ్వడం లాంటి సేవలను అందించారు. ఇది దేశంలోనే అత్యుత్తమ మున్సిపల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌గా అవార్డును సొంతం చేసుకుంది.
స్టాక్‌హోమ్ ఛాలెంజ్ అవార్డు సైతం ఈ ప్రాజెక్టుకు లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఆయన ఈ-సేవ విధానాన్ని ఆయన గ్రామీణ ప్రాంతాలకు ప్రయోగాత్మకంగా విస్తరించారు. ఏపీ ఐటీ శాఖ కార్యదర్శిగా ‘మీసేవ’ ప్రాజెక్టుకు ఆయనే రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేశారు.
More Stories
తుంగభద్ర నీటి వాటాలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి
నితిన్ నబిన్ తెలంగాణలో 28 నుంచి మూడు రోజుల పర్యటన
తెలంగాణలో నేటి నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం