ఇంగ్లాండ్ లో పదేళ్లలో ఆరుగురు ప్రధానులు రాజీనామా

ఇంగ్లాండ్ లో పదేళ్లలో ఆరుగురు ప్రధానులు రాజీనామా
లేబర్ పార్టీని భారీ ఎన్నికల విజయానికి నడిపించిన దాదాపు రెండేళ్ల తర్వాత, పార్టీలో పెరుగుతున్న తిరుగుబాటు నేపథ్యంలో ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తన రాజీనామాను ప్రకటించారు.  ఐదేళ్ల పూర్తి పదవీకాలం ముగియకముందే స్టార్మర్ తప్పుకుంటున్న నేపథ్యంలో, కేవలం దశాబ్ద కాలం కంటే కొంచెం ఎక్కువ వ్యవధిలోనే బ్రిటన్ తన ఏడవ ప్రధాన మంత్రిని చూడబోతోంది. 
 
ఆయన నిష్క్రమణ, 2016 నుండి బ్రిటీష్ రాజకీయాలను సమూలంగా మార్చివేసిన రాజకీయ అస్థిరత అసాధారణ దశను కొనసాగిస్తోంది.  2016 నుండి, ఆరుగురు ప్రధాన మంత్రులు పూర్తి పదవీకాలం పూర్తి చేయకముందే రాజీనామా చేశారు లేదా పదవి నుండి తొలగింపుకు గురయ్యారు. సగటున ప్రతి ఒకటిన్నర నుండి రెండేళ్లకు ఒకరుచొప్పున మారారు. నాయకుల ఈ వేగవంతమైన మార్పు, గతంలో బ్రిటిష్ ప్రధాన మంత్రులు చాలా సంవత్సరాలు పాలించిన కాలానికి పూర్తి విరుద్ధంగా ఉంది.
 
ఇది మార్గరెట్ థాచర్, టోనీ బ్లెయిర్ వంటి వారి సుదీర్ఘ పదవీకాలాలకు (వీరిద్దరూ ఒక్కొక్కరు దశాబ్దం కంటే ఎక్కువ కాలం దేశాన్ని నడిపించారు) పూర్తి భిన్నం. చరిత్రలో అత్యధిక కాలం యూకే ప్రధాన మంత్రిగా పనిచేసిన వ్యక్తి రాబర్ట్ వాల్‌పోల్; ఆయన 1721 నుండి 1742 వరకు రెండు దశాబ్దాలకు పైగా ఆ పదవిలో ఉన్నారు. ఇటీవలి కాలంలో, థాచర్ 1979 నుండి 1990 వరకు 11 ఏళ్లకు పైగా, అలాగే బ్లెయిర్ 1997 నుండి 2007 వరకు 10 ఏళ్లపాటు ప్రధాన మంత్రిగా పనిచేశారు.
 
కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు లిజ్ ట్రస్ కేవలం 44 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆమె తర్వాత భారత సంతతికి చెందిన రిషి సునక్ 20 నెలల పాటు ప్రధానిగా కొనసాగారు. ట్రస్‌కు ముందు కరోనా పార్టీ వివాదాల్లో చిక్కుకున్న బోరిస్ జాన్సన్, బ్రెగ్జిట్ కారణంగా పదవి కోల్పోయిన థెరిస్సా మే, వీరందరికంటే ముందు ఈయూ ఓటింగ్‌తో జూదం ఆడిన డేవిడ్ కామెరూన్ ఉన్నారు.
 
మాజీ విదేశాంగ మంత్రి అయిన లిజ్ ట్రస్ సెప్టెంబరు 2022లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. డౌనింగ్ స్ట్రీట్‌లో అడుగుపెట్టీ పెట్టగానే ఒక పెద్ద వివాదానికి తెరలేపారు. దేశంలో అత్యంత సంపన్నులైన 5 శాతం మందికి మేలుచేసేలా 45 బిలియన్ పౌండ్ల పన్ను మినహాయింపును ప్రకటించారు. 
కరోనా తర్వాత మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా భావించిన ట్రస్ అనాలోచిత విధానంలో ఏడాదికి 150,000 కంటే ఎక్కువ పౌండ్లు సంపాదించే వారికి 2 బిలియన్ పౌండ్ల పన్ను మినహాయింపు ఇవ్వాలనేది ప్రధానాంశం. దీనిపై సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తకావడంతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అక్టోబర్ 2022లో తన పదవికి ట్రస్ రాజీనామా చేశారు.
ట్రస్ కాలం నాటి గందరగోళాన్ని తట్టుకుని నిలబడిన వ్యక్తి భారత సంతతికి చెందిన రిషి సునాక్. ట్రస్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే పన్ను మినహాయింపును హెచ్చరించారు. దాన్ని ‘కల్పిత ఆర్థిక వ్యవస్థ’గా అభివర్ణించారు. ట్రస్ వారసుడిగా సునాక్‌ పగ్గాలు పట్టిన ఆయన  అక్టోబరు 2022 నుంచి జులై 2024 వరకు దాదాపు రెండేళ్ల పాటు ప్రధానిగా కొనసాగారు. 
 
ట్రస్ సృష్టించిన గందరగోళాన్ని ఆయన పూర్తిగా చక్కదిద్దలేకపోయారు. వలసలను తగ్గిస్తానన్న ఆయన వాగ్దానాలు, స్కూళ్లలో గంజాయిని నిషేధిస్తామనే హామీలు ఆయనకు పెద్దగా కలిసిరాలేదు. అయినప్పటికీ, ఆయన 2024 ఎన్నికల వరకు కొనసాగారు. 
జుట్టు సరిగ్గా దూవ్వుకోకపోయినా ‘బ్రెగ్జిట్‌ను పూర్తి చేస్తా’ అని బోరిస్ జాన్సన్ వాగ్దానం చేశారు. నిజాయితీగా చెప్పాలంటే, ఏదోలా దాన్ని ఆయన సాధించారు. బ్రిటన్‌ను ఐరోపా సమాఖ్య నుంచి బయటకు తీసుకువచ్చారు. యూరోపాయేతర దేశాలతో 11 కొత్త వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. కరోనా సమయంలో 393 బిలియన్ పౌండ్ల వ్యయ ప్రతిస్పందనను పర్యవేక్షించారు. 
 
కానీ, కరోనావైరస్‌కు కట్టడికి విధించిన లాక్‌డౌన్ సమయంలో ప్రధాని కార్యాలయంలో ఆయన పార్టీలు చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని ప్రజల నుంచి గట్టిగా డిమాండ్ రావడంతో చివరికి ‘పార్టీగేట్’ వివాదమే ఆయన పదవిని ముంచేసింది. దాంతో ఆయన బయటకు వెళ్లిపోయారు.
 
బోరిస్ జాన్సన్‌ కంటే ముందు థెరిస్సా మే యూకే ప్రధానిగా ఉన్నారు. డేవిడ్ కామెరూన్ వదిలివెళ్లిన బ్రెగ్జిట్ అనే ‘బాంబు’ను ఆమె వారసత్వంగా స్వీకరించారు. దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిసారీ ఆమె విఫలమయ్యారు. ఆమె ఒక ప్రతిపాదన తెస్తే ఇటు ఈయూ అంగీకరించేది కాదు, అటు టోరీలు (కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు) లొంగేవారు కాదు.

అమె ఒప్పందాన్ని పార్లమెంటు మూడు సార్లు తిరస్కరించింది. అది చాలా ఘోరమైన అవమానం. 2019 నాటికి సొంత పార్టీయే ఆమెకు ఎదురు తిరిగింది. 1,075 రోజుల తర్వాత డౌనింగ్ స్ట్రీట్ తలుపు తాళాన్ని వారు మార్చేశారు. ‘బ్రెగ్జిట్’ మాత్రమే ఆమె పాలిట శాపమైంది. థెరిస్సా మే కంటే డేవిడ్ కామెరూన్ యూకే ప్రధానిగా ఉన్నారు. బ్రెగ్జిట్ రెఫరెండం ద్వారా పార్టీని తన నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆయన భావించారు.

ఆయన దాదాపు ఆరేళ్ల పాటు ప్రధానిగా కొనసాగారు. 2016 ఎన్నికల్లో ఓటింగ్‌పై తన పార్టీ ఐక్యతను ఆయన పందెంగా పెట్టారు.  బ్రిటన్ ప్రజలను ఈయూలో ‘కొనసాగుదామా’ లేక విడిపోయి మెరూన్ రంగు పాస్‌పోర్టులను వాడుకుందామా అని అడిగారు. ప్రజలు ‘విడిపోదాం’ అని తేల్చి చెప్పారు. దాంతో షాకైన కామెరూన్ ‘సరే, అయితే నేను రాజీనామా చేస్తున్నా’ అని పదవి నుంచి తప్పుకున్నారు.