పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. సుమారు రూ.440 కోట్ల నిధులున్న ఈ ఖాతాలలో లావాదేవీలను నిలిపివేశారు. పార్టీలో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తిరుగుబాటు నేత రిత్నబ్రత బెనర్జీ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బిధానగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు ప్రారంభమయ్యాయి.
పార్టీ ఖాతాల్లో జమ అయిన నిధులపై సమగ్ర విచారణ జరపాలని, అందులో ‘కట్ మనీ’, బలవంతపు వసూళ్లు, ప్రజాధనం దుర్వినియోగం వంటి అక్రమాలు ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. కోల్‌కతాలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సెంట్రల్ ప్లాజా బ్రాంచ్‌లో ఉన్న పార్టీ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ నిలిపివేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.
ఇటీవలి ఎన్నికల అనంతరం టీఎంసీలో విభేదాలు పొడచూపాయి. ఈ క్రమంలోనే పార్టీ మాజీ కోశాధికారి అరూప్ బిస్వాస్ జూన్ 12న బ్యాంకు యాజమాన్యానికి లేఖ రాస్తూ పార్టీలో అంతర్గత వివాదాలు ఉన్నందున లావాదేవీలను నిలిపివేయాలని అభ్యర్థించారు. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఈ వ్యవహారంలోకి పోలీసులు ప్రవేశించి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ పరిణామాలను టీఎంసీ అధికారిక వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ ఇదంతా రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగానే ఉన్నాయని, ఈ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశాయి. మరోవైపు అరూప్ బిస్వాస్‌కు పార్టీ ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీచేసింది. అయితే పార్టీ నిధులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని తిరుగుబాటు వర్గం పట్టుబడుతోంది. ఈ తాజా ఘటనతో పార్టీ ఆస్తులు, ఉనికి కోసం సాగుతున్న ఆధిపత్య పోరు మరింత ముదిరినట్లయింది.
ఒక ప్రైవేట్ రంగ బ్యాంకులో ఉన్న ఖాతాలను డెబిట్ కార్యకలాపాల కోసం స్తంభింపజేసినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి ఒకరుతెలిపారు. డబ్బు ఉపసంహరణలు, బయటి లావాదేవీలు నిలిపివేయబడినప్పటికీ, క్రెడిట్లు మాత్రం కొనసాగవచ్చు. ప్రస్తుతం ఈ మూడు ఖాతాలు డెబిట్ ఫ్రీజ్‌లో ఉండటంతో, టీఎంసీ ఆర్థిక నియంత్రణపై పోరాటం అంతర్గత నాయకత్వ వివాదాన్ని దాటి, పోలీసు ఫిర్యాదులు, అధికారంపై పరస్పర వాదనలు, పార్టీ ఖాతాలలో ఉన్న వందల కోట్ల రూపాయల మూలాలపై ప్రశ్నలతో కూడిన ఘర్షణగా మారింది.

More Stories
జూన్ లో 39 శాతం పెరిగిన రష్యా చమురు దిగుమతులు
రిలయన్స్ జియో ఐపీవోకు రంగం సిద్ధం
ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కు ఎదురుదెబ్బే