జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులు అరెస్ట్

జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులు అరెస్ట్

* సరిహద్దు వద్ద ఏకే-47 రైఫిల్, 25 పిస్టల్స్ స్వాధీనం

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద సానుభూతిపరులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్‌, కిష్ట్వారా జిల్లాలోని, దచ్చన్ ఏరియాలో పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించారు. అనేక ప్రాంతాలో సోదాలు నిర్వహించారు. నిఘా పెంచారు.  ఈ క్రమంలో ఉగ్రవాదులకు సాయమందిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 

 
వారిలో ఒక ప్రభుత్య ఉద్యోగి కూడా ఉన్నాడు. నిందితులను తారిక్ అహ్మద్ గిను, మొహమ్మద్ ఇక్బాల్‌గా గుర్తించారు. వీరిలో తారిక్ అహ్మద్ గిను అటవీ శాఖలో పని చేస్తున్నాడు. ఈ అంశంపై స్థానిక సీనియర్ ఎస్పీ నరేష్ సింగ్ వివరాలు వెల్లడించారు.  అరెస్టైన ఇద్దరు నిందితులు తీవ్రవాదులకు సహకరించారు. వారు తీవ్రవాదులకు రవాణాలో సాయం చేయడం, నిర్వహణ పరమైన సాయం, తీవ్రవాద కార్యకలాపాలలో సాయపడటం చేశారు. 
 
తీవ్రవాదులు అక్కడ ఉండేందుకు, నెట్‌వర్క్ విస్తరించేందుకు తోడ్పడ్డారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతరుల వివరాలపై, వారి కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇంతకుముందు కూడా ఉగ్రవాదులకు సాయం చేశారనే అంశంపైనే మునీర్ అహ్మద్, మష్కూర్ అహ్మద్‌ అనే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

మరోవంక, భారత్-పాకిస్థాన్‌ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), పోలీసులు కలిసి సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఒక కారు నుంచి ఏకే-47 రైఫిల్, 25 పిస్టల్స్‌తో సహా 26 అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సంఘటన జరిగింది. 

భారత్‌-పాక్‌ సరిహద్దు సమీపంలో డ్రోన్‌ ద్వారా ఆయుధాలు జారవిడిచినట్లు బీఎస్‌ఎఫ్‌కు సమాచారం అందడంతో  స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ పోలీసులతో  కలసి ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఒక అనుమానిత కారును అడ్డుకుని తనిఖీ చేయగా ఏకే 47 రైఫిల్, 25 పిస్టల్స్‌తో సహా 26 అత్యాధునిక ఆయుధాలు, 368 లైవ్ కాట్రిడ్జ్‌లు, 48 మ్యాగజైన్‌లు, అమెరికాలో తయారైన ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ఆ కారులో ఉన్న అమృత్‌సర్‌లోని రూప్‌నగర్ కాలనీకి చెందిన నిందితుడు రోహన్ ఖోస్లాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన సహచరుడి ఆదేశాల మేరకు నిందితుడు ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసిందని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ తెలిపారు.