మాస్కోపై వేయి డ్రోన్లతో ఉక్రెయిన్‌ అతి పెద్ద దాడి

మాస్కోపై వేయి డ్రోన్లతో ఉక్రెయిన్‌ అతి పెద్ద దాడి
తమ దేశ రాజధాని మాస్కోపై మూడేండ్ల కాలంలో ఉక్రెయిన్‌ అతి పెద్ద డ్రోన్‌ దాడికి పాల్పడిందని రష్యన్‌ ప్రభుత్వ న్యూస్‌ ఏజెన్సీ టస్‌ తెలిపింది.  రష్యా రాజధాని ఆగ్నేయ శివార్లలోని ఒక చమురు శుద్ధి కర్మాగారాన్ని ఈ దాడి లక్ష్యంగా చేసుకుంది. దీనివల్ల విమాన రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా, సమీప ప్రాంతాల్లో నల్లని జిడ్డు పదార్థం పడినట్లు వార్తలు వచ్చాయి. 
 
ఈ దాడిలో కీలక చమురు శుద్ధి కేంద్రం దెబ్బతిందని, నగరంలో పలుచోట్ల మంటలు చెలరేగాయని పేర్కొన్నది. చమురు శుద్ధి కేంద్రం నుంచి కొన్ని మీటర్ల ఎత్తు వరకు మంటలు, పొగలు వెలువడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. తమ దేశ వైమానిక దళం 194 డ్రోన్లను కూల్చివేసిందని మాస్కో మేయర్‌ సెర్గీ సొబ్యనిన్‌ తెలిపారు.
 
ఉక్రెయిన్‌ సుమారు 1000 డ్రోన్లతో, 4 క్రూయిజ్‌ మిసైళ్లతో రాత్రివేళ రష్యా వ్యాప్తంగా దాడికి పాల్పడింది. దౌత్య ఒప్పందం కోసం ఒత్తిడి తీసుకు రావడానికే ఈ దాడి చేసినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ‘మా దేశం తగలబడితే, మీ మాస్కో కూడా తగలబడుతుంది’ అని ఆయన రష్యాను హెచ్చరించారు.  తమ దాడికి స్పందనగా రష్యా ఏడు క్షిపణులను, 239 డ్రోన్లను తమ దేశంపై ప్రయోగించిందని ఉక్రెయిన్‌ తెలిపింది.
కీవ్‌, పొల్టావా ప్రాంతాల్లోని చమురు కేంద్రాలపై దాడి చేసినట్టు రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది. రాజధానిని లక్ష్యంగా చేసుకుని దాదాపు 200 డ్రోన్లు దాడి చేయడంతో మాస్కో ప్రాంతంలో కనీసం 17 మంది గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు.  దెబ్బతిన్న శుద్ధి కర్మాగారం సమీపంలో నివసించే ప్రజలు, దాడి తర్వాత తమ దుస్తులు, బయటి ఉపరితలాలపై నల్లని మచ్చలు లేదా రేణువులు కనిపించినట్లు తెలిపారు.
శుద్ధి కర్మాగారం సమీపంలో నివసించే ప్రజలు, దుస్తులు, ఉపరితలాలపై నల్లని మరకలను మిగిల్చిన ఒక రకమైన ‘తేలికపాటి జల్లు’ కురిసిందని వివరించారు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా దాదాపు 1,000 డ్రోన్‌లు, నాలుగు ఉక్రేనియన్ క్రూయిజ్ క్షిపణులను అడ్డుకున్నట్లు లేదా ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ తన సుదూర దాడుల సామర్థ్యాలను విస్తరించుకోవడంతో, మాస్కోపై డ్రోన్ దాడులు మరింత తరచుగా జరుగుతున్నాయి.
 
2023లో రష్యా రాజధానిపై జరిగిన తొలి దాడులు చాలా వరకు పరిమితంగా ఉన్నాయి. అయితే, ఇటీవలి ఆపరేషన్లలో గణనీయంగా ఎక్కువ సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించారు. మాస్కో డ్రోన్ల దాడిని ఎదుర్కొంటుండగా, రష్యా కూడా రాత్రికి రాత్రే ఉక్రెయిన్‌పై 200కు పైగా డ్రోన్లతో పాటు పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని కీవ్ తెలిపింది.