పాకిస్థాన్ ఒక ఫ్రాంకెన్‌స్టీన్ రాజ్యం

పాకిస్థాన్ ఒక ఫ్రాంకెన్‌స్టీన్ రాజ్యం
* ఉగ్రవాదానికి మద్దహతు ఇస్తూ బాధితురాలిగా చిత్రీకరించుకొంటుంది 
 
`పాకిస్తాన్ ఒక ఫ్రాంకెన్‌స్టీన్ రాజ్యం’ అని పేర్కొంటూ ఒకవైపు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూనే, మరోవైపు తనను తాను ఉగ్రదాడుల బాధితురాలిగా చిత్రీకరించుకుంటోందని భారత్ ఆరోపించింది. గతంలో పాకిస్తాన్ నాయకులే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, శిక్షణ ఇవ్వడం గురించి బహిరంగంగా మాట్లాడారని దౌత్యవేత్త అనుపమ సింగ్ గుర్తు చేశారు. 
 
ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ వార్షిక నివేదికపై జరిగిన చర్చ సందర్భంగా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ ప్రతినిధి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన తర్వాత ధీటుగా బదులిస్తూ తాను సృష్టించడానికి సహాయపడిన శక్తులే తనపై తిరగబడినప్పుడు దిగ్భ్రాంతికి గురయ్యే పాకిస్తాన్‌ను ఆమె ఒక “ఫ్రాంకెన్‌స్టీన్ రాజ్యం”గా అభివర్ణించారు. 
 “అయినప్పటికీ, పాకిస్తాన్ తనను తాను ఉగ్రవాద బాధితురాలిగా పిలుచుకుంటుంది. నిజానికి, ఇది ఒక వైరుధ్యం, దీనిని పాకిస్తాన్ మాత్రమే కొనసాగించగలదు. తన సొంత రాక్షసుడే తిరిగి కాటు వేసినప్పుడు దిగ్భ్రాంతికి గురయ్యే ఫ్రాంకెన్‌స్టీన్ రాజ్యానికి ఇది ఒక సజీవ ఉదాహరణ,” అని భారత దౌత్యవేత్త ధ్వజమెత్తారు.
 
పాకిస్తాన్  ఆక్రమిత కాశ్మీర్‌లోని పరిణామాలపై, ముఖ్యంగా రావల్కోట్‌లో ఇటీవల జరిగిన అశాంతిపై కూడా భారత్ దృష్టి సారించింది. భారత దౌత్యవేత్త ప్రకారం, “సంవత్సరాల తరబడి కొనసాగిన అణచివేత, స్వేచ్ఛపై ఆంక్షలు, కఠినమైన విధానాలు ఈ ప్రాంతంలో పెరుగుతున్న ప్రజాగ్రహానికి ఆజ్యం పోశాయి.”  ప్రాథమిక హక్కులు, మెరుగైన జీవన పరిస్థితుల కోసం చేసిన డిమాండ్లను తరచుగా బలప్రయోగంతోనే అణచివేశారని ఆమె వాదించారు.
“రావల్కోట్‌లో కొనసాగుతున్న విషాదం, వందలాది మంది పౌరుల హత్య, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అంతటా జరుగుతున్న క్రూరమైన అణచివేత అనేవి బలవంతపు ఆక్రమణపై నిర్మించబడి, అణచివేత ద్వారా కొనసాగించబడుతున్న వ్యవస్థ ఊహించదగిన పర్యవసానాలే” అని ఆమె పేర్కొన్నారు

“దశాబ్దాలుగా సాగుతున్న సైనిక భూ ఆక్రమణలు, జనాభా ఇంజనీరింగ్, ప్రాథమిక స్వేచ్ఛల నిరాకరణ వంటివి రొట్టె, విద్యుత్, హక్కులు, గౌరవం వంటి డిమాండ్లను సైతం తూటాలు, క్రూరత్వంతో ఎదుర్కొనే స్థాయికి పరిస్థితులను తీసుకువచ్చాయి. ఇది ఎవరినీ ఆశ్చర్యపరచకూడదు. చట్టవిరుద్ధమైన, అక్రమమైన ఆక్రమణను కేవలం బలప్రయోగం ద్వారా మాత్రమే కొనసాగించగలం,” అని సింగ్ తెలిపారు. 

ఈ నెల ప్రారంభంలో రావల్కోట్‌లో జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా పలువురు మరణించడం, గాయపడటం వంటి వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఉగ్రవాదం, కాశ్మీర్ అంశాలతో పాటు, సింధు జలాల ఒప్పందంపై తన వైఖరిని సమర్థించుకోవడానికి భారత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. 1960లో కుదిరిన ఈ ఒప్పందాన్ని ఇకపై నేటి వాస్తవాలకు దూరంగా విడిగా చూడలేమని సింగ్ వాదించారు.