దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 పనితీరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించి, వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల నమోదును సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వ్యవస్థలు, బహుభాషా మద్దతు (మల్టీలాంగ్వేజ్ సపోర్ట్) అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
సైబర్ నేరాలకు సంబంధించిన ప్రతి ఫిర్యాదు తుది పరిష్కారం పొందే వరకు కేంద్ర, రాష్ట్ర సంస్థలు సమన్వయంతో పనిచేయాలని అమిత్ షా స్పష్టం చేశారు.అలాగే సైబర్ మోసాల దర్యాప్తు సమయంలో ఫ్రీజ్ అవుతున్న బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులను కూడా ప్రాధాన్యంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్ఓపి ప్రకారం, మనీ రిస్టోరేషన్ అండ్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ ఫ్రేమ్‌వర్క్ కింద, నిధులను పునరుద్ధరించే అవకాశం ఉన్న సుమారు 94 లక్షల బ్యాంకు ఖాతాలను ఇప్పటివరకు అప్‌లోడ్ చేసినట్లు అధికారులు హోం మంత్రికి తెలియజేశారు.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ఫిర్యాదులను స్వీకరించి, వేగంగా స్పందించేందుకు భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4సి) ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పి) ను 2019 ఆగస్టు 30న ప్రారంభించారు. తొలుత బాలలపై లైంగిక నేరాలు, అత్యాచారాలకు సంబంధించిన ఆన్‌లైన్ కంటెంట్ ఫిర్యాదులకే పరిమితమైన ఈ పోర్టల్‌ను అనంతరం అన్ని రకాల సైబర్ నేరాలకు విస్తరించారు.
ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే ఆర్థిక మోసాలను అడ్డుకునేందుకు ప్రత్యేక సమగ్ర వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో పోలీసులు, బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఎన్‌పీసీఐ, చెల్లింపు సేవల సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. డిజిటల్ మోసాలకు గురైన బాధితులు 1930 హెల్ప్‌లైన్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.
సైబర్ మోసాల నుంచి డబ్బును కాపాడేందుకు తొలి గంటల్లో ఫిర్యాదు చేయడం అత్యంత కీలకమని అధికారులు సూచిస్తున్నారు. ఏఐ ఆధారిత వ్యవస్థలు, స్థానిక భాషల్లో ఫిర్యాదు సదుపాయం, రాష్ట్రాలతో మెరుగైన సమన్వయం వంటి చర్యలతో సైబర్ నేరాల నియంత్రణలో మరింత వేగం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

More Stories
25 మంది ఎస్పీ ఎంపీలు పార్టీ నుంచి విడిపోయేందుకు సిద్ధం
సమాజంలో మార్పులు తీసుకు రావడంలో జెన్ జెడ్ కీలక పాత్ర
మణిపూర్‌లో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో భద్రత దళాలు అప్రమత్తం!