మహిళా మావోయిస్టు శకుంతల లొంగుబాటు

మహిళా మావోయిస్టు శకుంతల లొంగుబాటు

మావోయిస్టు వ్యతిరేక చర్యల నేపథ్యంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ ప్రభావం మరింత స్పష్టమవుతోంది. ఈ క్రమంలో దీర్ఘకాలంగా మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన మహిళా నేత శకుంతల అలియాస్ పుష్ప కోల్‌కతా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమె వద్ద నుంచి ఒక తుపాకీతో పాటు 40 రౌండ్ల మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

భద్రతా సంస్థల వాంటెడ్ జాబితాలో ఉన్న శకుంతలపై ప్రభుత్వం రూ.10 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. గత రెండు దశాబ్దాలుగా వివిధ మావోయిస్టు కార్యకలాపాల్లో ఆమె కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు చెబుతున్నారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ అజయ్ నంద్ వివరాల ప్రకారం, శకుంతల 2001లో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితురాలై సంస్థలో చేరారు. ప్రారంభంలో సాంస్కృతిక విభాగంలో పనిచేస్తూ విప్లవ గీతాలు, ప్రచార కార్యక్రమాలు, కరపత్రాల పంపిణీ వంటి బాధ్యతలను నిర్వహించారు. 

తరువాత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో ప్రముఖ నాయకురాలిగా ఎదిగిన శకుంతల, దల్మా జోన్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ఐదవ తరగతిలో ఉన్నప్పుడే ఆమె మావోయిస్టుల్లో చేరారు.  బీహార్, జార్ఖండ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనలతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పశ్చిమబెంగాల్, పోరుగు రాష్ట్రాల్లో ఆమెపై నాలుగు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

లొంగుబాటు అనంతరం శకుంతల మాట్లాడుతూ హింసా మార్గం ఎలాంటి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వదని, తుపాకీ కంటే ప్రశాంత జీవితం ఎంతో విలువైనదని చెప్పారు. ఇంకా అడవుల్లో సాయుధ పోరాటం కొనసాగిస్తున్న మావోయిస్టులు ఆయుధాలు వదిలి సమాజంలో కలిసిపోవాలని ఆమె సూచించారు. శకుంతల లొంగుబాటుతో జంగల్‌మహల్ ప్రాంతంలో మావోయిస్టు నెట్‌వర్క్ బలహీనపడే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఆమె నిర్ణయం ప్రభావంతో మరికొందరు క్యాడర్లు కూడా ప్రధాన ప్రవాహంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.