‘నా కుమార్తెను ప్రధాని క్షమించి కొత్త జీవితం ఇచ్చారు’ 

‘నా కుమార్తెను ప్రధాని క్షమించి కొత్త జీవితం ఇచ్చారు’ 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన కుమార్తెను క్షమించి కొత్త జీవితం ఇచ్చారని ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలిక తల్లి తెలిపారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలకు మైనర్ బాలిక చేతులు జోడించి క్షమాపణలు కోరిన వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బాలిక తల్లి ఒక వార్తాసంస్థతో మాట్లాడతూ తన కుమార్తెపై దాఖలైన ఎఫ్ఐఆర్‌ను కూడా కొట్టివేయాలని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఇవాళ తన కుమార్తె పుట్టినరోజు అని, ఆమెకు పునర్జన్మ లభించిందని, ప్రధాని అత్యంత గొప్ప కానుకగా తమ కుమార్తెకు కొత్త జీవితాన్ని ఇచ్చారని చెప్పారు.  ‘‘తీవ్ర అసభ్యకరమైన పదజాలం వాడిన ఈ దేశ పుత్రికను క్షమించి ప్రధాని మోదీ తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఆయనకు నేను చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఆమెకు పునర్జన్మ. ప్రధాని ఆమెకు కొత్త జీవితాన్ని అతిపెద్ద బహుమతిని ఇచ్చారు’’ అని ఆ తల్లి చెప్పారు.
జంతర్ మంతర్ వద్ద నిరసనల సమయంలో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు ఆధారంగా నోయిడా పోలీసులు గత వారం `జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేశారు. 
 ఆ ఎఫ్‌ఐఆర్‌లో నిందితురాలిని 25 ఏళ్ల రుచికా సింగ్‌గా గుర్తించారు. అయితే, ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న పేరు, వయస్సు తప్పు అని ఆమె తల్లి స్పష్టం చేశారు. ఆమె ప్రశాంతమైన జీవితం గడిపేందుకు ఉన్న కేసును కొట్టివేయించాలని ఆమె ప్రధానమంత్రిని కోరారు.
‘‘మేము సిగ్గుపడుతున్నామని ఎలా చెప్పగలం? మేము చేసిన తప్పును గ్రహించాం. ప్రధాని నరేంద్ర మోదీకి నా మనవి. దయచేసి ఆమెపై తప్పుడు పేరు, వయస్సుతో నమోదు చేసిన కేసును తొలగించండి. తద్వారా ఆమె ప్రశాంతంగా జీవించగలదు. ఇప్పుడు ఆమె మీ పర్యవేక్షణలో ఉంది’’ అని ఆ తల్లి పేర్కొన్నారు.  అంతేకాదు, మైనర్ పిల్లలు చాలా సున్నితంగా ఉంటారని, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇతరులు వారిని తమ స్వార్థం కోసం సులభంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉందని పేర్కొంటూ చిన్నపిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలని ఆమె ప్రధానమంత్రిని కోరారు.
 
‘‘ప్రధాని మోదీకి నా విన్నపం ఏంటంటే 18 ఏళ్లలోపు పిల్లల కోసం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను నిలిపివేయాలి. వారిని కేవలం చదువుకోవడానికి మాత్రమే అనుమతించాలి. నిరసన తెలిపే సైట్‌లకు వారిని అనుమతించకూడదు. ఈ పిల్లలను సులభంగా వాడుకోవచ్చు. చిన్న పిల్లలకు ప్రపంచం గురించి గానీ, పెద్దలను ఎలో గౌరవించాలోనే తెలియదు’’ అని ఆమె తెలిపారు. 
మరోవైపు, మోదీ తనను క్షమించడంపై 15 ఏళ్ల విద్యార్థిని భావోద్వేగానికి గురైంది. అంతా అయిపోయిందనుకున్న సమయంలో ప్రధాని చూపిన ఉదారత తనకి రెండోసారి జీవితాన్ని ఇచ్చిందని ఆ బాలిక చెప్పుకొచ్చింది.