‘టైమ్స్’ అత్యంత ప్ర‌భావ‌శీలుర జాబితాలో మంధాన‌!

‘టైమ్స్’ అత్యంత ప్ర‌భావ‌శీలుర జాబితాలో మంధాన‌!

భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఓపెన‌ర్ స్మృతి మంధాన‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. గ‌త కొంత కాలంగా నిల‌క‌డ‌గా రాణిస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు ‘టైమ్స్’ మ్యాగ‌జైన్ 100 మంది ‘అత్యంత ప్ర‌భావ‌శీలుర జాబితా’లో చోటు ద‌క్కింది. క్రీడా విభాగంలో ఎంద‌రో స్టార్లు ఉన్న‌ప్ప‌టికీ భార‌త్ నుంచి మంధాన మాత్ర‌మే ఎంపిక‌వ్వ‌డం విశేషం. ఫుట్‌బాల్ దిగ్గ‌జం లియోన‌ల్ మెస్సీ, టెన్నిస్ స్టార్ అల్క‌రాస్ ఈ జాబితాలో ఉన్నారు.

మహిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్‌పై అర్ధ శ‌త‌కంతో చెల‌రేగిన‌ టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మ‌రో ఘ‌న‌త సాధించింది. త‌న సొగ‌సైన ఆట‌తో కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న మంధాన‌ ఈసారి టైమ్స్ మ్యాగ‌జీన్ 100 మంది అత్యంత ప్ర‌భావ‌శీలుర జాబితాలో నిలిచింది.  విధ్వంస‌క బ్యాటింగ్‌తో వ్య‌క్తిగ‌త మైలురాళ్ల‌ను అందుకోవ‌డ‌మే కాకుండా భార‌త జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క‌మవుతున్నందున మంధాన‌ను ఎంపిక చేశామ‌ని టైమ్స్ మ్యాగ‌జీన్ పేర్కొంది.

అంతేకాదు ‘రికార్డులు మంధానకు దాసోహం అవుతున్నా’యని త‌మ ప్రొఫైల్‌లో పోస్ట్ పెట్టింది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మంధాన రికార్డుల మోత మోగించింది.  దేశ‌వాళీ వ‌న్డే మ్యాచ్‌లో డబుల్ సెంచ‌రీతో రికార్డు నెల‌కొల్పిన ఈ ఓపెన‌ర్ మూడు ఫార్మాట్ల‌లో శ‌త‌కం సాధించిన మొద‌టి భార‌తీయురాలిగా నిలిచింది. మహిళల క్రికెట్‌లో అద్భుతమైన విజయాలు, అన్ని ఫార్మాట్లలోనూ నిలకడైన ప్రదర్శన కనబరిచినందుకు 29 ఏళ్ల మంధాన గుర్తింపు పొందారు.

దేశవాళీ వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన, అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన తొలి భారతీయ మహిళగా ఆమె సాధించిన రికార్డులను ‘టైమ్’ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మహిళల క్రికెట్‌లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీల (17) రికార్డును సంయుక్తంగా కలిగి ఉండటంతో పాటు, ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1,000కి పైగా వన్డే పరుగులు చేసిన తొలి మహిళగా నిలవడం వంటి అంశాలను కూడా ఆమె గురించిన ఈ కథనం పేర్కొంది.

అంత‌ర్జాతీయంగానే కాదు ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ దుమ్మురేపింది మంధాన. మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు రెండు ట్రోఫీలు క‌ట్ట‌బెట్టింది. మంధాన సార‌థ్యంలో ఆర్సీబీ 2024, 2026లో ఛాంపియ‌న్‌గా నిలిచింది. భారత జట్టు ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్నప్పుడు ఆమె వైస్ కెప్టెన్‌గా వ్యవహరించడమే కాకుండా, ఆ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో ఒకరిగా నిలిచింది.

ప్రపంచ‌వ్యాప్తంగా క్రీడా రంగంలో 2026 సంవ‌త్స‌రంలో అథ్లెట్స్, కోచ్‌లు, ఎగ్జిక్యూటివ్స్, పెట్టుప‌డిదారులు, మార్పును తీసుకొచ్చిన వారితో టైమ్స్ మ్యాగ‌జీన్ ఒక జాబితా సిద్ధం చేసింది. అందులో ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్క‌రాస్, ఫిఫా అధ్య‌క్షుడు గియన్ని ఇన్‌ఫాంటినో వంటి వారున్నారు. భార‌త్ నుంచి ఈ హోదా అందుకున్న ఏకైక అథ్లెట్ త‌నే.