అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన ప్రాథమిక ఒప్పందం కుదిరిందని, హర్ముజ్ జలసంధి త్వరలోనే తిరిగి తెరుచుకోనున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మార్కెట్లకు ఊతమిచ్చింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారుల్లో సానుకూల భావన నెలకొంది. భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ఫ్యూచర్స్ ధరలు 4.77 శాతం తగ్గి బ్యారెల్‌కు 80.83 డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా దాదాపు 4 శాతం క్షీణించి బ్యారెల్‌కు 83.77 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు అమెరికా క్రూడ్ ధరలు 4.3 శాతం పడిపోయి బ్యారెల్‌కు 81.23 డాలర్లకు చేరాయి. అయితే యుద్ధం కారణంగా గత మూడు నెలలుగా సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాల ప్రభావం పూర్తిగా తొలగిపోవడానికి కొంత సమయం పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చమురు, సహజవాయు సరఫరాలు సాధారణ స్థితికి చేరాయని షిప్పింగ్, బీమా సంస్థలు పూర్తిగా నమ్మిన తర్వాతే ధరలు స్థిరపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఒప్పందం ప్రకటన అనంతరం ఆసియా ప్రధాన స్టాక్ మార్కెట్లు భారీగా ఎగిశాయి. జపాన్ నిక్కీ-225 సూచీ ప్రారంభ ట్రేడింగ్‌లో 5.1 శాతం లాభపడి 69,367 పాయింట్ల వద్ద కొనసాగింది.
ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతకు సంబంధించిన కంపెనీల షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. గత ఏడాదిలోనే నిక్కీ సూచీ 80 శాతానికి పైగా పెరగడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 1,270.75 పాయింట్లు పెరిగి 76,798.70 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 383.05 పాయింట్లు లాభపడి 24,005.95 వద్ద కొనసాగింది.
విస్తృత మార్కెట్లలో కూడా కొనుగోళ్లు జోరందుకున్నాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్-100 సూచీ 1.62 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్-100 సూచీ 1.43 శాతం మేర పెరిగాయి. ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ పథకాలకు సంబంధించి ఆర్‌బీఐ చర్యలు బ్యాంకుకు దీర్ఘకాలంలో అనుకూలంగా ఉంటాయని, విదేశీ కరెన్సీ డిపాజిట్లను ఆకర్షించడంతో పాటు ద్రవ్యతను మెరుగుపరచి మార్జిన్ ఒత్తిడిని తగ్గించే అవకాశముందని నోమురా విశ్లేషించింది.
మరోవైపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, టైర్ తయారీ సంస్థలు, పెయింట్ కంపెనీలు, విమానయాన రంగానికి చెందిన షేర్లు కూడా లాభపడ్డాయి. విదేశీ మారక మార్కెట్లో కూడా రూపాయి బలపడింది. ట్రంప్ ప్రకటన అనంతరం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 58 పైసలు పెరిగి 94.60కు చేరుకుంది. అమెరికా డాలర్ బలహీనపడటం రూపాయికి మద్దతుగా నిలిచింది. యుద్ధ ముగింపు ప్రకటనతో ప్రపంచ సరఫరా గొలుసు పుంజుకుంటుందనే నమ్మకం కలగడమే ఈ భారీ లాభాలకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
More Stories
భారత్ విజయాలను `తక్కువ చేసి’ చూపే రాహుల్ ప్రయత్నం
50 శాతం పెరిగిన కీలక కాన్సర్ ఔషధాల ధరలు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు