పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నియామకానికి సంబంధించి ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై, టిఎంసి నేత అభిషేక్ బెనర్జీ రెండోసారి సిఐడి విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయం ఆయన కోల్ కతాలోని సిఐడి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నేతలతో వరుస సమావేశాల అనంతరం కోల్‌కతాకు చేరుకున్న రోజే, గురువారం నాడు డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్‌ను సిఐడి అధికారులు తమ ప్రధాన కార్యాలయంలో ఐదున్నర గంటల పాటు విచారించారు.
విచారణ సంస్థ జరుపుతున్న దర్యాప్తునకు సహకరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, గతంలో తనకు జారీ చేసిన మూడు సమన్లకు హాజరుకాకుండా ఉన్నప్పటికీ, చివరకు ఆయన సిఐడి ప్రధాన కార్యాలయానికి చేరుకుని విచారణకు హాజరయ్యారు. అయితే, గత వారం జరిగిన విచారణలో అభిషేక్ బెనర్జీ ఇచ్చిన సమాధానాలపై సిఐడి అధికారులు సంతృప్తి చెందలేదని, అందుకే ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆదివారం విచారణకు హాజరుకావాల్సిందిగా మరో టిఎంసి ఎమ్మెల్యే కునాల్ ఘోష్ కు కూడా సమన్లు జారీచేశారు. ఈ కేసుకు సంబంధించి నిర్దిష్ట ప్రతాలను సమర్పించాల్సిందిగా అభిషేక్ బెనర్జీని కోరామని సిఐడి తెలిపింది. ఆదివారం బెనర్జీని ఎనిమిదిన్నర గంటలసేపు విచారించగా, కునాల్ ఘోష్ ను నాలుగు గంటలకు పైగా విచారించారు.
సీఐడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, విచారణలో భాగంగా తనను, బెనర్జీని ముఖాముఖిగా ప్రశ్నించారని ఘోష్ పేర్కొన్నారు. “నేను వారి ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చాను. వారి దర్యాప్తుకు సహకరించాను,” అని ఆయన తెలిపారు. దర్యాప్తు సంస్థలోని ఒక విశ్వసనీయ వర్గం ప్రకారం, సీఐడీ అధికారులు ఇద్దరు నాయకులను ఉమ్మడి విచారణకు పిలవడానికి ముందు, మొదట వారిని విడివిడిగా ప్రశ్నించారు.
“విచారణను నమోదు చేశారు. జరిగిన సమావేశాలు, వాటికి ఎవరు హాజరయ్యారు, తీర్మానంపై ఎవరు సంతకం చేశారు, పత్రాలను ఎలా తయారు చేసి సమర్పించారు అనే విషయాలపై ప్రశ్నలు అడిగారు,” అని ఆ వర్గం తెలిపింది. గతంలో జరిగిన విచారణలో బెనర్జీ ఇచ్చిన కొన్ని సమాధానాలపై దర్యాప్తు అధికారులు స్పష్టత కోరుతున్నారని, అందుకే ఆయనను మళ్లీ పిలిపించారని సమాచారం.
జూన్ 11న జరిగిన తన మొదటి విడత విచారణలో, ప్రతిపక్ష నాయకుడి పదవికి పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపే తీర్మానం ఏ పరిస్థితుల్లో రూపొందించారు? దానిపై ఎప్పుడు సంతకం చేశారు? అనే విషయాలపై ఆ టీఎంసీ నేతను ప్రశ్నించారు.

More Stories
దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో లైంగిక విద్య
కమెడియన్ సమయ్ రైనాపై`సుప్రీం’ ఆగ్రహం.. రూ 3 లక్షల జరిమానా
హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్